Telugu Gateway
Politics

ముగ్గురూ..ముగ్గురే!

ముగ్గురూ..ముగ్గురే!
X

ప్రధాని నరేంద్రమోడీ. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ముగ్గురూ..ముగ్గురే. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అవసరం లేకపోయినా వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ఫిరాయించేలా చేసి..ఏకంగా అందులో కొంత మందికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారు. అదే చంద్రబాబు ఇప్పుడు ఏకంగా తాను ఒక్కడినే దేశంలో ‘ప్రజాస్వామ్య పరిరక్షకుడి’ని అన్నట్లు కలరింగ్ ఇస్తూ మాట్లాడుతున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ విషయానికి వస్తే ఆయన కూడా సేమ్ టూ సేమ్. ఒకప్పుడు ఫిరాయింపులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన ఆయన ఓ సారి రాజకీయ ఏకీకరణ అని..మరో సారి ఇంకో పేరు చెప్పి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. అదేమని అడిగితే కాంగ్రెస్ వాళ్ళు చేయలేదా? అని ఎదురుప్రశ్నలు వేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు తెలంగాణలో మరోసారి ఈ ఫిరాయింపుల వ్యవహారం జోరుగా సాగుతుంది. అదేంటి అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారంట. పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తారంట.

నిజంగా టీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉంటే వాళ్ళలో వాళ్ళు చర్చించుకోవాలి కానీ..ఈ విషయం టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ తో, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ తో చర్చిస్తారా?. వీళ్ళు ఏమైనా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిని సర్దుబాటు చేస్తారా?. తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పే నేతలు ఓటర్ల తీర్పును అపహస్యం చేస్తూ తెలంగాణను ఓ ఫిరాయింపుల కేంద్రంగా మార్చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీ బహిరంగంగా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని చెప్పటం మాత్రం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

లోక్ సభ ఎన్నికల తర్వాత ఈ ఫిరాయింపుదారులతో మమతా బెనర్జీ సర్కారును కూలగొడతామనే తరహాలో మాట్లాడటం ద్వారా ప్రధాని నరేంద్రమోడీ తాను కూడా అదే తానులో ముక్కను తప్ప..ప్రత్యేకం ఏమీ కాదని నిరూపించుకున్నారు. ఇదొక్కటే కాదు..మోడీ తీరును చూసి కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్ని దారుణాలు చేయలేదు అనే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ సీఎం కెసీఆర్ మనం చేస్తున్నది కూడా అదే కదా? అన్న రీతిలో మోడీ వ్యాఖ్యలపై ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రపంచ ప్రజాస్వామ్య పరిరక్షకుడిలా ..అసలు గతంలో తాను ఇలాంటి పనులే ఏమీ చేయలేదన్నట్లు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Next Story
Share it