Telugu Gateway
Politics

కెటీఆరే గ్లోబ‌రీనాకు టెండ‌ర్ ఇప్పించారు

కెటీఆరే గ్లోబ‌రీనాకు టెండ‌ర్ ఇప్పించారు
X

తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఓ వైపు తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ గ్లోబ‌రీనా పేరును తాను ఇంట‌ర్ వివాదం వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే విన్నాన‌ని..త‌న‌కు ఆ కంపెనీ ఎవ‌రిదో తెలియ‌ద‌ని ప్ర‌క‌టించారు. రేవంత్ రెడ్డి మాత్రం ఆ సంస్థ‌కు టెండ‌ర్ ఇప్పించింది కెటీఆరే అని ఆరోపించారు. గ్లోబరీనా గురించి తెలియదంటూ కెటీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన రేవంత్ .. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థను పక్కన పెట్టి మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్, గ్లోబరీనాలకు టెండర్లు కట్టబెట్టారన్నారు. ఇదంతా కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడే జరిగిందన్నారు. ఎంసెట్ పరీక్షల నిర్వహణ కోసం 1996లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ఏర్పాటైందని.. అప్పట్లో పరీక్షల ప్రకటన, ముద్రణ, ఫలితాలు మూడు సంస్థలకు అప్పగించేవాన్నారు. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదన్నారు. 2016లో అన్నిటినీ కలిపి మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్‌కు కట్టబెట్టారన్నారు. ఆ సమయంలోనే ఎంసెట్ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయన్నారు. దీనిపై సీబీసీఐడీకి కేసు అప్పగించినా.. ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా నీరుగార్చారని విమర్శించారు. ప్రధాన నిందితులు ఇద్దరూ చనిపోయారని తెలిపారు.

ఒకరు కస్టడీలో చనిపోగా మరొకరు ప్రమాదవశాత్తు చనిపోయారని ... ఆ రెండూ అనుమానాస్పద మరణాలే అన్నారు. దీనిపై ఎందుకు విచారణ జరగలేదని ప్రశ్నించారు. పరీక్షలు నిర్వహించిన మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్‌కు చెందిన విజయ రావు, ప్రద్యుమ్నలపై ఎందుకు దృష్టి పెట్టలేదన్నారు. ‘‘గ్లోబరీనా, మ్యాగ్నటిక్ సంస్థలూ రెండు భాగస్వామ్య సంస్థలు. దుర్మార్గంగా 23 మంది చావులకు కారణమయ్యాయి. కంపెనీల పేర్లు వేరు... వీళ్లంతా ఒక్కటే. కలిసి వ్యాపారం చేస్తున్నారు. కాకినాడ జేఎన్‌టీ‌యూ వీరిపై క్రిమినల్ కేసులు పెట్టింది. మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్ సంస్థ నిషేధిత సంస్థ. అలాంటి సంస్థ టెండర్‌ను పక్కన పెట్టి.. గ్లోబరీనాకు ఇవ్వడంలోనే వాళ్ల ఉద్దేశం దాగుంది. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే టెండర్లు వేశారు. ఎవరిని మభ్య పెడుతున్నారు కేటీఆర్. దీనిపై పెద్ద కుట్ర జరిగింది. రాష్ట్రంలో 10 లక్షల మంది ఇంటర్ చదువుతున్నారు. ఒక్కో విద్యార్థిపై కనీసం లక్ష ఖర్చుపెడుతున్నారు. ఏటా పది వేల కోట్ల రూపాయల వ్యాపారం ఇది. విద్యార్థుల డేటాను ప్రైవేటుకి ఇచ్చారు. నిబంధనలు ఒప్పుకోవు. కార్పొరేట్ కాలేజీల మాఫియా, దోపిడీకి తార్కాణం ఇది’’ అంటూ రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు.

Next Story
Share it