Telugu Gateway
Andhra Pradesh

కృష్ణా జిల్లాలోనూ ఫిఫ్టీ..ఫిఫ్టీ!

కృష్ణా జిల్లాలోనూ ఫిఫ్టీ..ఫిఫ్టీ!
X

తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా ఇది షాక్ లాంటి వార్తే. ఎందుకంటే ఆ పార్టీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న వాటిలో కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు కూడా ఉంది. ఎందుకంటే రాజధాని ప్రాంతంగా ఈ రెండు జిల్లాల్లో గతంలో కంటే యాక్టివిటి గణనీయంగా పెరగటం..భూముల విలువలు అనూహ్యంగా ఊపందుకోవటం వంటి అంశాలపై టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం టీడీపీ ఆశించిన స్థాయిలో కన్పించటం లేదు. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఈ ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో పరిస్థితి ఫిఫ్టీ..ఫిఫ్టీగా కన్పిస్తోంది. టీడీపీ కంటే వైసీపీనే కొంత ఎడ్జ్ లో కన్పిస్తున్నా...జిల్లాలోని 16 సీట్లలో చెరి సగం దక్కించుకోవటం ఖాయంగా కన్పిస్తోంది. క్షేత్రస్థాయిలో సాగిన పరిశీలన ప్రకారం పక్కాగా వైసీపీ గెలిచే వాటిలో అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, మచిలీపట్నం, నూజివీడు, తిరువూరు, విజయవాడ సెంట్రల్, నందిగామ, మైలవరం నియోజకవర్గాలు ఉన్నాయి.

సాగునీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో పోటీ మాత్రం చాలా తీవ్రంగా ఉంది. అయితే నందిగామ లేదా మైలవరాల్లో ఏదో ఒకటి మాత్రం వైసీపీ ఖాతాలో చేరటం మాత్రం పక్కాగా కన్పిస్తోంది. టీడీపీ గ్యారంటీగా గెలుచుకునే సీట్లలో పెనమలూరు, గన్నవరం, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, కైకలూరు నియోజకవర్గాలు ఉన్నాయి. జగ్గయ్యపేట, పెడనల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఈ సీటు దక్కించుకుంటారో అన్నది ఫలితాల వరకూ సస్పెన్సే. అయితే టీడీపీ తాము ఈ జిల్లాలో అత్యధిక స్థానాలు దక్కించుకుంటామని ధీమాగా ఉన్న తరుణంలో క్షేత్రస్థాయిలో కన్పిస్తున్న సంకేతాలు మాత్రం అందుకు భిన్నంగా ఉండటం ఆసక్తికర పరిణామం. ఏపీ గెలుపును నిర్దేశించే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ వైసీపీ ఈసారి తక్కువలో తక్కువగా 18 నుంచి 20 సీట్లు దక్కించుకోవటం గ్యారంటీగా చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ సస్పెన్స్ లు వీడాలంటే రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారు మే 23 వరకూ నరాలు తెగే ఉత్కంఠతో వేచిచూడాల్సిందే.

Next Story
Share it