Telugu Gateway
Politics

పాలన కంటే ‘ఫిరాయింపుల’పైనే కెసీఆర్ ఫోకస్!

పాలన కంటే ‘ఫిరాయింపుల’పైనే కెసీఆర్ ఫోకస్!
X

ప్రజా తీర్పును అపహస్యం చేస్తున్న టీఆర్ఎస్

తెలంగాణలో ‘ప్రజా తీర్పు’ అపహస్యం పాలవుతోంది. ఓటు విలువ గురించి గొప్పలు చెప్పే నేతలు ఆ ఓటునే ఎగతాళి చేస్తున్నారు. ఉదాహరణకు ఖమ్మం జిల్లా పాలేరులో సాక్ష్యాత్తూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావే ఓటమి పాలయ్యారు. కారణాలు ఏమైనా అక్కడ టీఆర్ఎస్ అభ్యర్ధిని ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ అభ్యర్ధి కందాల ఉపేందర్ రెడ్డిని గెలిపించారు. చివరకు ఆయన కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇది పాలేరు నియోజకవర్గ ప్రజలను వంచించటం కాదా?. టీఆర్ఎస్ పార్టీనే పాలేరు ప్రజలు కోరుకుని ఉంటే తుమ్మల నాగేశ్వరరావుకే ఓటు వేసేవాళ్ళు కదా?. అలా కాదని కందాల ఉపేందర్ రెడ్డిని గెలిపిస్తే..ఆయన కూడా టీఆర్ఎస్ లో చేరితే అది ఓట్లు వేసిన ప్రజలను ఎంత దారుణంగా మోసినట్లు? ఇదే పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఉంది. టీఆర్ఎస్ లో చేరిన ప్రతి ఒక్కరూ కెసీఆర్ అభివృద్ధికి ఆకర్షితులై చేరుతున్నట్లు ప్రకటనలు గుప్పిస్తున్నారు. వాళ్ళకు ఆ అభివృద్ధి ఇప్పుడే కన్పించిందా?. ఎన్నికల ముందే ఆ పనిచేస్తే ఎవరూ అభ్యంతరం చెప్పేవారు కాదా కదా?. అంటే టీఆర్ఎస్ లో టిక్కెట్ రాదు. కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచి..ప్రజలను వంచించి..తర్వాత ‘అభివృద్ధికి ఆకర్షితులు’ అవుతారా?.

తెలంగాణ రాష్ట్రంలో రెండవ సారి కూడా అప్రతిహత మెజారిటీతో అధికారం దక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, సీఎం కెసీఆర్ పాలన కంటే ‘ఫిరాయింపుల’ఫైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు కన్పిస్తోంది. ఇంటర్మీడియట్ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఓ వైపు బోర్డు అక్రమాలపై గగ్గోలు పెడుతుంటే అదేమీ పెద్దగా పట్టించుకోని సర్కారు మరో వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేను తమ పార్టీలో చేర్చుకునే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికే 11 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిపోయారు. గడువు ఉన్నా కూడా అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నారు అంటే.. కాంగ్రెస్ పార్టీ పాలనను అడ్డుకుంటున్నందుకే అని అప్పట్లో కెసీఆర్ ప్రకటించారు. మరి అదే అభివృద్ధి నిరోధక పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు మాత్రం ముద్దు అయ్యారు కెసీఆర్ కు. కెసీఆర్ రెండవ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు రెండు నెలల వరకూ అసలు మంత్రివర్గ విస్తరణే చేయలేదు.

కొత్తగా గెలిచిన తర్వాత సీఎం కెసీఆర్ ఎక్కువ సమయం లోక్ సభ ఎన్నికలు..ఫిరాయింపులపై ఫోకస్ పెట్టారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ 88 సీట్లతో అధికారాన్ని దక్కించుకున్నా కూడా రాష్ట్రంలో అసలు ఇక ప్రతిపక్షమే ఉండకూడదు అన్న చందంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరిని రకరకాల ప్రలోభాలతో టీఆర్ఎస్ లో చేర్చుకుంటోంది. దీనిపై వివిధ వర్గాల ప్రజల్లో టీఆర్ఎస్ పై విపరీతమైన వ్యతిరేకత పెరుగుతోంది. అయితే ప్రస్తుతానికి వీటిని పట్టించుకునే మూడ్ లో అధికార టీఆర్ఎస్ ఉన్నట్లు కన్పించటం లేదు. ఫిరాయించిన ప్రతి ఒక్కరూ ‘అవసరం అయితే రాజీనామా’ అనే నినాదాన్ని అందుకున్నారు. రాజీనామా ఎవరికి అవసరం అవుతుంది? ఎందుకు అవసరం అవుతుంది?.

Next Story
Share it