‘జెర్సీ’ మూవీ రివ్యూ
నాని. టాలీవుడ్ లో ఒకప్పుడు వరస హిట్లు అందుకున్న హీరో. గత కొంత కాలంగా ఈ హీరో స్పీడ్ తగ్గింది. దేవదాస్ తర్వాత నాని నటించిన సినిమానే ఈ ‘జెర్సీ’. క్రికెట్..ఫ్యామిలీ.మధ్యలో స్నేహితులు. ఎంతో సాదాసీదా కథను ఆసక్తికరంగా మలచటంలో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి విజయవంతం అయ్యారని చెప్పొచ్చు. అర్జున్(నాని) పిచ్చ క్రికెట్ ప్రేమికుడు. క్రికెటే జీవితంగా బతుకుతాడు. శారీరక ఒత్తిడి పెరిగితే ప్రాణాలకు ప్రమాదం అని డాక్టర్ చెప్పటంతో ఎంతో భారంతో క్రికెట్ కు గుడ్ బై చెబుతాడు. ఆ తర్వాత ఎఫ్ సిఐలో ఉద్యోగం చేస్తూ జీవితం కాలం వెళ్ళదీస్తాడు. కానీ అర్జున్ పాత్రేమీ లేకపోయినా ఎఫ్ సిఐలో కూడా అవినీతి ఆరోపణలతో ఆ ఉద్యోగం కూడా పోతుంది. చివరకు ప్రతి రూపాయికి భార్య సారా (శ్రద్ధా శ్రీనాధ్) జీతం పైనే ఆధారపడాల్సి వస్తుంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఆమె కూడా పనీపాటా లేకుండా తిరుగుతున్న అర్జున్ పై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అర్జున్ తన లాగే తన కొడుకుకు కూడా క్రికెట్ నేర్పిస్తాడు. అయితే తన క్లాస్ లో ఓ కుర్రాడికి ‘జెర్సీ’ టీ షర్టు ఉందనే కారణంగా కెప్టెన్ ఇచ్చారని..తనకు కూడా జెర్సీ కొనిపెట్టాలని కోరతాడు అర్జున్ కొడుకు. కానీ అయిదు వందల రూపాయల దొరక్క అర్జున్ ఆ పని చేయలేకపోతాడు.
అనారోగ్య కారణాల వల్ల క్రికెట్ ఆపేసిన అర్జున్ మళ్ళీ ఎందుకు క్రికెట్ లోకి అడుగుపెడతాడు. అక్కడ సాధించిన విజయాలు ఏంటి అనేదే సినిమా. కొడుకు అడిగిన ‘జెర్సీ’ టీ షర్ట్ కొనివ్వటానికి అర్జున్ పడే తపన..స్నేహితులను అప్పు అడిగే సందర్భంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల కంట తడిపెట్టిస్తాయి. ఫ్యామిలీ డ్రామాను భావోద్వేగంగా మలచటంతో సినిమా ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. క్రికెటర్ పాత్రలో అర్జున్ గా నాని నటన సూపర్బ్ అనేలా ఉంది. హీరోయిన్ శ్రద్ధా శ్రీనాధ్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేయటంతో పాటు ఎమోషన్స్ ను కూడా చక్కగా పండించారు. కోచ్ పాత్రలో సత్యరాజ్ నటించారు అనేకంటే జీవించారు అనటం కరెక్ట్ గా సరిపోతుంది.
క్రికెట్ కు సంబంధించిన సీన్లు వచ్చిన సమయంలో అసలు నిజంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మ్యాచ్ చూసే అభిమానులు ఎలా ఉత్కంఠకు గురవుతారో..అంతటి హైప్ ను సినిమాలో క్రియేట్ చేశారు. మ్యాచ్ ల సమయం తోపాటు ఇతర కీలక సన్నివేశాల సందర్భంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్. క్రికెట్...ఫ్యామిలీ డ్రామాను సీరియస్ గా లాగిస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుందని..మధ్యలో కామెడీ కూడా కనెక్ట్ చేశారు. సినిమాలో కొన్ని సంభాషణలు ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. ఓవరాల్ గా ‘జెర్సీ’ సినిమాతో నాని మరో సారి హిట్ ట్రాక్ లో వచ్చినట్లే. ఈ సమ్మర్ లో ప్రతి ఒక్క ప్రేక్షకుడు హాయిగా చూడదగ్గ సినిమా జెర్సీ.
రేటింగ్. 3.5/5