Telugu Gateway
Politics

రెండు లక్షల 30వేల ఉద్యోగాల భర్తీ..రైతుకు ఏటా ఏభై వేలు

రెండు లక్షల 30వేల ఉద్యోగాల భర్తీ..రైతుకు ఏటా ఏభై వేలు
X

ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీ భారీ వరాలతో 2019 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను ప్రకటించింది. అన్ని వర్గాలను సంతృప్తిపర్చేలా వరాల వర్షం కురిపించారు. వచ్చే ఎన్నికల్లో తమ గెలుపునకు ఇది నాంది అవుతుందని వైసీపీ భావిస్తోంది. శనివారం నాడు అమరావతిలో ఉగాది వేడుకల అనంతరం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. ఇందులో పలు కీలక అంశాలు ఉన్నాయి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పయి వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని..ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగ నియామకాలు కేలండర్ ను విడుదల చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో రైతులకు ఏటా 50 వేల రూపాయల పెట్టుబడి సాయం కింద అందజేస్తామని ప్రకటించారు. దీంతోపాటు ఐదు లక్షల రూపాయల ఆదాయం లోపు ఉన్న వారందరికీ యూనివర్శల్ హెల్త్ కార్డు ను ప్రవేశపెట్టి వెయ్యి రూపాయల పైబడిన ఆరోగ్య బిల్లులను సర్కారే భరిస్తుందని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే బీసీల అభ్యున్నతికి సంవత్సరానికి రూ. 15,000 కోట్ల చెప్పున ఐదేళ్లలో రూ. 75,000 కోట్లు ప్రత్యేక ఉప ప్రణాళిక ద్వారా ఖర్చు చేస్తామని జగన్ ప్రకటించారు.

రాజకీయ ఎదుగుదల కోసం అన్ని నామినేటేడ్‌ పదవుల్లో(దేవాలయ ట్రస్టు బోర్డులు, మార్కెట్‌ యార్డు కమిటీలు, కార్పొరేషన్లు తదితర) బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. అంతేకాదు ఆర్థిక ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్, కాంట్రాక్ట్‌ వర్క్స్‌ లో కూడా 50శాతం బీసీ, ఎసీ, ఎస్టీ మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకొస్తామన్నారు. బీసీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్సార్‌ పెళ్లి కానుకగా, ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న రూ. 35,000లని రూ.50,000లకు పెంచుతామని ప్రకటించారు. ప్రమాదవశాత్తు బీసీ కులాలకు చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్సార్‌ బీమా ద్వారా రూ. 5,00,000 ఇస్తామన్నారు. షాపులు ఉన్న నాయీ బ్రాహ్మణులకు, లాండ్రీషాపు ఉన్న రజకులకు, టైలర్‌ షాపులున్న టైలర్లకు సంవత్సరానికి రూ. 10,000 ఆర్థిక సహాయం చేస్తాం. వారికి తోడుగా ఉంటాం. మత్స్యకారులకు వేట నిషేద సమయంలో( ఏప్రిల్‌ 15-జూన్‌ 14) ఆర్థిక సహాయం రూ. 4,000 వేలు నుంచి రూ. 10,000 పెంచుతాం. మత్స్యకారుల పడవలకు కొత్తగా అనుమతులు మంజూరు చేస్తాం. ప్రమాదశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌ గ్రేషియా ఇస్తాం.మగ్గం ఉన్న చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ. 24,000 ప్రోత్సాహకంగా ఇస్తాం. కులవృత్తిదారులు, చిరువ్యాపారులకు ( పుట్‌పాత్‌ మీద సామన్లు అమ్ముకునేవారికి, తోపుడు బండ్ల మీద కూరగాయలు, టిఫెన్లు అమ్ముకునేవారికి ఇంకా అనేకమైన చిరువ్యాపారులు) రోజుకు రూ. 2000 నుంచి రూ.3000 పెట్టుబడి కోసం రూ. 3,4 నుంచి 10 రూపాయల వడ్డీతో అప్పులు తీసుకుని అవస్థలు పడుతున్న ఆ చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులిచ్చి రూ. 10,000 సున్నా వడ్డీకే ఇస్తాం.

ఆ సొమ్మును వారు ఎప్పుడైనా తీసుకోవచ్చు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్‌కు సంవత్సరానికి రూ. 2,000 కోట్లు చొప్పున ఐదేళ్లలకు కలిపి రూ. 10,000 కోట్లు కేటాయిస్తాం. ఖర్చు చేస్తాం. జూనియర్‌ న్యాయవాదులకు మొదటి 3 సంవత్సరాల ప్రాక్టీస్‌ పీరియడ్‌లో ప్రతి నెలకు రూ. 5000 స్టైఫండ్‌ ఇస్తాం. న్యాయవాదుల సంక్షేమ నిధి కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తాం. అర్చకులకు రిటైర్మెంట్‌ విధానాన్ని రద్దు చేస్తాం. 6సీ దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు మార్చి 2019 జీఓలో సూచించిన వేతనం కంటే అదనంగా 25 శాతం జీతాలు పెంచుతాం. దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు మరియు అర్చకుల వేతనాల కోసం పంచాయితీ జనాభాను బట్టి నెలకు రూ 10,000 నుంచి రూ 35,000 వరకూ ఇస్తాం. అర్చకులకు ఇళ్ల స్ధలాలు కేటాయించి వారికి ఇళ్లు కట్టిస్టాం. క్రిష్టియన్‌ మైనారిటీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్‌ఆర్‌ కానుకగా రూ 1,00,000 ఇస్తాం.

పాస్టర్లకు వివాహ రిజిస్ర్టార్‌ లైసెన్స్‌ పద్ధతిని సులభతరం చేస్తాం. పాస్టర్లకు రూ 5000 తగ్గకుండా గౌరవం వేతనం ఇస్తాం. హోలీ ల్యాండ్‌ యాత్రకు వెళ్లే క్రిష్టియన్స్‌కు ఆర్థిక సాయం చేస్తాం. అన్ని అగ్రకులాల (క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ తదితర) వారికి కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. ఆ కార్పొరేషన్‌లకు తగిన నిధులు కేటాయించి ఆయా కులాలకు చెందిన పేదలకు అండగా ఉంటాం. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జగన్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. సీపిఎస్‌ రద్దు చేస్తాం, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తాం. ఉద్యోగులు కోరుకున్న విధంగా అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్‌ ఇస్తాం. అంతేకాదు సకాలంలో పీఆర్‌సీ అమలుపరుస్తాం. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత, సర్వీసును పరిగణనలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్‌ చేస్తాం. సమాన పనికి-సమాన వేతనం ప్రాతిపదికన అవుట్‌ సోర్సింగ్‌ వారికి న్యాయం చేస్తాం. పెన్షనర్స్‌ సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తాం.

పోలీసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వీక్లీ ఆఫ్‌ను అమలు చేస్తాం. సైనికులు, మాజీ సైనికులు చట్టం వారికి కల్పించిన రాయితీలు, హక్కులు కూడా పొందలేని పరిస్థితిలో ఉన్నారు. వీటిని మారుస్తూ వీరికి గౌరవమిస్తూ ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో ఒక ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసి వారి సమస్యలను యుద్ధప్రాతిపదిక పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక హోదా దేవుడి దయతో సాధిద్దాం..తద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకువస్తాం. పరిశ్రమల స్ధాపనకు ప్రోత్సాహకంగా ఇస్తున్న రాయితీలకు (భూమి, పన్ను, విద్యుత్‌ తదితర) తోడు ఏపీఐడీసీని పునరుద్ధరించి తద్వారా నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించి కొత్త అథ్యాయానికి శ్రీకారం చుడతాం. సొంత ఆటో/టాక్సీ నడిపే వారికి ఇన్సూరెన్స్‌, ఫిట్‌నెస్‌, రిపేర్లు తదితర అసవరాల కోసం సంవత్సరానికి రూ. 10వేలు ఇస్తాం. 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న ఏ పౌరుడైనా సహజంగా మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్సార్‌ జీవన బీమా పథకం ద్వారా రూ. లక్ష అందిస్తాం. ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. (మాదిగలకు, మాలలకు మరియు రెల్లి తదితర కులాలకు). ఎస్సీ మరియు ఎస్టీ సబ్‌ప్లాన్‌ను పారదర్శకంగా అమలు చేస్తాం. ఎస్సీ, ఎస్టీలకు భూపంపిణీ కార్యక్రమంతోపాటు ఉచితంగా బోరు వేయించి ఇస్తాం.

ఎస్సీ, ఎస్టీ చెల్లెమ్మల వివాహానికి ‘వైఎస్సార్‌ పెళ్లికానుక’గా లక్ష రూపాయలు ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ కాలనీలలో మరియు గిరిజన తండాలలో ప్రతి ఇంటికీ 200 యూనిట్‌ల వరకు ఉచిత కరెంట్‌ ఇస్తాం లేదా సంవత్సరానికి రూ. ఆరు వేలు నేరుగా చేతికే ఇస్తాం. గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటుచేసి అందులో ప్రత్యేకంగా యూనివర్సిటీ, మెడికల్‌ కాలేజ్‌ మరియు ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ఏర్పాటు చేస్తాం. జర్నలిస్టులకు ఆయా ప్రాంతాలలో ఇంటి స్థలాలు ఏర్పాటు చేస్తాం. వైఎస్సార్‌ కలలు కన్న జలయజ్ఞాన్ని పూర్తిచేస్తాం. పోలవరం, పూల సుబ్బయ్య వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తాం. రక్షిత మంచినీరు - సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. మళ్లీ జలకళను తీసుకొస్తాం. ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా జగన్ పార్టీ నేతలతో కలసి నాలుగు పేజీల మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచారు. ఇది అత్యంత పారదర్శకంగా ఉంటుందని..మేనిఫెస్టో అమలును ఎప్పటికప్పుడు సమీక్షామని తెలిపారు. టీడీపీలాగా తాము పుస్తకాలకు పుస్తకాలు వేయమని..చేయగలిగిన వాటినే మేనిఫెస్టోలో పొందుపర్చామని జగన్ వెల్లడించారు.

Next Story
Share it