వైసీసీ విజయం తధ్యం

అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన గురువారం రాత్రి మీడియాతో మాట్లాడారు. ‘పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనడం మాకు అనుకూలం. ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం. రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. దేవుడి దయ వల్ల పోలింగ్ శాతం పెరిగింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాటానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఓటేస్తే వీవీ ప్యాట్‌లో వాళ్ల ఓటు కనిపిస్తుంది. నా ఓటు నాకు కనిపించింది. ఇంత శాతం పోలింగ్ జరిగితే టీడీపీ వాళ్ల ఆరోపణలు నిరాధారం. దేవుడి దయ, ప్రజల దీవెనతో వైఎస్సార్ సీపీకి భారీ విజయం తధ్యం.’ అని జగన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరును జగన్ తప్పుపట్టారు. ఓటమి తప్పదని తేలిపోవడంతో చంద్రబాబు తన స్థాయిని మరిచి దిగజారి వ్యవహరించారని విమర్శించారు. చంద్రబాబు ఎన్నికల కమిషన్ ను బెదిరించడం, ఓటింగ్ శాతం తగ్గించడానికి ప్రయత్నించడం, అనేక చోట్ల అరాచకాలు, డ్రామాలు ఆడటం వంటివెన్నో చేశారని దుయ్యబట్టారు. ఇటువంటి పనులు చేసినందుకు ఆయన సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. చంద్రబాబు చేసిన కుట్రలు, కుయుక్తులు, డ్రామాలు అన్నింటిని దాటుకున్ని ఓటు వేసిన ప్రజలకు వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు.
పోలింగ్ సందర్భంగా వైఎస్సార్ సీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు చనిపోయారని, వారికి పార్టీ అన్నవిధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఎస్ జగన్ మాట్లాడుతూ...‘ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ పార్టీ నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలుపుతున్నా. పోలింగ్ సందర్భంగా చిత్తూరు, అనంతపురంలో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు కార్యకర్తలు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. వాళ్లందరికీ నా ప్రగాఢ సానుభూతి. టీడీపీ చేసిన చర్యలు చాలా బాధాకరం. విజయనగరం జిల్లా కురుపాంలో పుష్ప శ్రీవాణి, గురజాలలో కాసు మహేష్ రెడ్డి, పూతలపట్టులో ఎంఎస్ బాబుపై టీడీపీ నేతలు దాడులు చేశారు. ఇక మంగళగిరిలో నారా లోకేష్ యథేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. మేరుగ నాగార్జునపై టీడీపీ నేతలు దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఎన్నికల్లో అక్కడక్కడ సమస్యలు రావడానికి రాక్షసుడిగా ఉన్న చంద్రబాబు కారణమని, ఆయన ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారని జగన్ అన్నారు. రిటర్న్ గిఫ్ట్ ల వ్యవహారం చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య సాగిందని, అందులో తమకెలాంటి సంబంధం లేదన్నారు.