జగన్ కీలక ప్రకటన

వైసీపీ మేనిఫెస్టో ప్రకటించటానికి ఒక రోజు ముందు వైసీపీ అదినేత జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు యూనివర్శల్ హెల్త్ కార్డు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్డు ద్వారా ఏపీతో పాటు హైదరాబాద్, బెంగుళూరుల్లో కూడా ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చని ప్రకటించారు. గతంలో దివంగత రాజశేఖరరెడ్డి ప్రకటించిన ఆరోగ్య శ్రీ పధకం పేద ప్రజల మనసుల్లో నిలబడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ అదే తరహాలో అత్యంత కీలకమైన ప్రకటన చేయటం ద్వారా కీలక అడుగు వేసినట్లు అయింది. ఏడాదికి రూ. 5లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కొత్తగా యూనివర్సల్ హెల్త్ కార్డులు తీసుకువస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. నెలకు రూ. 40 వేల వరకు జీతం ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలు చేయిస్తామని తెలిపారు. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే చాలు వాళ్లందరిని యూనివర్సల్ హల్త్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీలోకి తీసుకువస్తామన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో తానే ఈ పథకాన్ని దగ్గరి ఉండి పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ప్రైవేటు విద్యాసంస్థలో ఫీజులను నియంత్రిస్తామన్నారు. గుంటూరులో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు. . గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి ముస్తాఫాను, గుంటూరు పశ్చిమ అభ్యర్థి ఏసురత్నంను, గుంటూరు ఎంపీ అభ్యర్థిగ వేణుగోపాల్‌రెడ్డిని గెలించమని కోరారు.
‘గుంటూరు సిటీ మీదుగా నా పాదయాత్ర సాగింది. జిల్లాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రోడ్లు తవ్వి పూడ్చకుండా వదిలివేశారు. నిర్లక్ష్యం కారణంగా తాగునీటి పైపుల్లోకి మురుగు నీరు చేరి డయేరియా వచ్చి 32 మంది చనిపోలేదా?. ప్రతిపక్షం ఆందోళన చేస్తే తప్ప చంద్రబాబు మనుషులు చనిపోయినట్టు ఒప్పుకోలేదు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనే ఉన్న గుంటూరులోనే పరిస్థితి ఇలా ఉంది. ఈ రోజుకు కూడా దెబ్బతిన్న పైపులైన్లను బాగు చేయలేదు. శివార్లలో ఇప్పటికి రెండు రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సదుపాయాలు ఎలా ఉన్నాయో మీరంతా చూశారు. ఆస్పత్రిలో లైట్లు, జనరేటర్లు లేక సెల్ ఫోన్ వెలుతురులో ఆపరేషన్లు చేస్తున్నారు. ఇదే ఆస్పత్రిలో చిన్నారి ఎలుకలు కోరికి చనిపోవడం చూశాం. ఏ ముఖ్యమంత్రి పాలనలోనైనా మనం ఇలాంటి ఘటనలు చూశామా?. ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై అపనమ్మకం కలిగి.. ప్రైవేటు హాస్పిటల్స్‌కు వెళ్లేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు అంటూ ధ్వజమెత్తారు.