Telugu Gateway
Politics

ఇంటర్ పొరపాట్లు ‘అపొహలు’ కాదు...అడ్డగోలు అక్రమాలే

ఇంటర్  పొరపాట్లు ‘అపొహలు’ కాదు...అడ్డగోలు అక్రమాలే
X

లక్షలాది మంది ఇంటర్ విద్యార్ధులకు సంబంధించిన అంశాన్ని తొలుత విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటీఆర్ లు చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఓ వైపు పరీక్ష రాసిన విద్యార్ధులు తమకు అన్యాయం జరిగిందని ఏకంగా ప్రాణాలు తీసుకుంటుంటే నేతలిద్దరూ ‘అపొహలు’ అంటూ వ్యాఖ్యానించి..వ్యవహారం ఏదో చిన్న అంశం అన్నట్లు వ్యవహరించారు. ఎవరి విషయం ఎలా ఉన్నా..పరీక్ష రాసిన విద్యార్దులకు అయితే తెలుస్తుంది కదా?. వారు ఎలా రాసింది. ఆ బాధతోనే చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిద్దరికి తోడు విద్యా శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి కూడా ప్రతిసారి చాలా మంది ఇంటర్ తప్పుతారు అంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. నిజంగా పరీక్ష సరిగా రాయని తప్పితే ఎవరూ ఫీలవరు. కానీ పరీక్షలు బాగా రాసిన వారు ప్రభుత్వ, ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల తప్పితే దానికి ఎవరిది బాధ్యత?. ఇప్పుడు అదే జనార్ధన్ రెడ్డి త్రిసభ్య కమిటీ నివేదిక ఇదిగో అంటూ ఎన్నో అక్రమాలను బయటపెట్టారు.

విద్యార్ధుల ఆత్మహ్యతల సమయంలో కెటీఆర్ ఏప్రిల్ 21న చేసిన ట్వీట్ ఇది. ‘ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విషయంలో చోటుచేసుకున్న అపోహలపై విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమీక్షించారు. ఈ అపోహలను తొలగించడానికి ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. సత్వరమే దర్యాప్తు జరిపి మూడు రోజులలో ఈ కమిటీ నివేదికను సమర్పిస్తుంది.’ అని తెలిపారు. ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి చెప్పిన వివరాలు ఇవి. ‘ ఓఎంఆర్ షీట్ల జంబ్లింగ్ సరిగా జరగలేదు. ఫలితాల వెల్లడిలో కొన్ని తప్పులు దొర్లాయి. కొందరికి ప్రాక్టికల్ మార్కులు యాడ్ కాలేదు. జంబ్లింగ్ లో కూడా కొన్ని తప్పులు జరిగాయి. సాఫ్ట్ వేర్ లోపంతో కోడింగ్, డీకోడింగ్ లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. బాధ్యులు అందరిపై చర్యలు తీసుకుంటాం. డేటా ప్రాసెస్ చేసే సంస్థతో ఎలాంటి అగ్రిమెంట్ జరగలేదు. ఆ సంస్థకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు.

ఫలితాల వెల్లడి తర్వాతే అగ్రిమెంట్ అని ఆ సంస్థకు స్పష్టత ఇచ్చాం. బాధ్యులు అందరిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇకపై తప్పులు దొర్లకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నాం.’ అని తెలిపారు. అసలు ఒప్పందం లేకుండా ఓ ప్రైవేట్ సంస్థ అయినా గ్లోబరీనా లక్షలాది మంది విద్యార్ధుల జీవితాలతో ఎలా చెలగాటం ఆడుతుంది. అసలు ప్రభుత్వం అందుకు ఎలా అనుమతి ఇస్తుంది?. ఏ మాత్రం సన్నద్ధత లేని గ్లోబరీనా సంస్థకు ఇంతటి కీలక బాధ్యతలు ఎవరి ప్రోద్భలంతో ఇచ్చారు?. అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. త్రిసభ్య కమిటీ నివేదికతో విద్యార్ధుల మృతికి పూర్తి బాధ్యత ఇంటర్ బోర్డుదే అని తేలిపోయింది. మరి దీనిపై సర్కారు ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it