Telugu Gateway
Politics

నా దగ్గర సీబీఎన్ ఆర్మీ ఉంది

నా దగ్గర సీబీఎన్ ఆర్మీ  ఉంది
X

‘అసలు నేనేందుకు భయపడాలి. నేనెవరికి భయపడాలి. నా దగ్గర సీబీఎన్ ఆర్మీ ఉంది. వాళ్లే ఉత్సాహంగా ముందుకొచ్చి సేవలు అందిస్తున్నారు. ’ అని తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. జగన్ ఎన్నికల ప్రచారానికి వస్తున్న యువతకు మందు పోస్తున్నారని తల్లులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో కోటి మందికి స్మార్ట్ ఫోన్లు అందిస్తామని ప్రకటించారు. అంతే కాకుండా పండుగల సీజన్లలో రెండు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే ఒక్క బటన్ నొక్కితే చాలా నేరుగా వాటిని పరిశీలిస్తామని వెల్లడించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ఈ హామీలు గుప్పించారు. జగన్, కెసీఆర్, మోడీలను నమ్ముకుంటే రాష్ట్ర భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. కెసీఆర్ ఎప్పుడైనా ఏపీకి అనుకూలంగా మాట్లాడారా? అని ప్రశ్నించారు.

మాయావతి కూడా ఏపీకి ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని చెప్పారన్నారు. భద్రాచలం మునిగిపోతుందని..కెసీఆర్ పోలవరానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అవసరం అయితే భద్రాచలాన్ని కూడా ఏపీనే తీసుకుంటుందని అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు తెలంగాణ నియంత్రణలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. అలాంటి వారికి జగన్ మద్దతు ఇస్తున్నారని..అలాంటి జగన్ ను మీరు అనుమతిస్తారా? అని ప్రశ్నించారు. కేంద్రంలో మళ్లీ మోడీనే వస్తారన్న జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో మోడీ, కెసీఆర్, జగన్ లకు ప్రజలు తమ ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.

Next Story
Share it