Telugu Gateway
Politics

బాబు నోట అప్పుడే ‘ట్యాంపరింగ్’ మాట

బాబు నోట అప్పుడే ‘ట్యాంపరింగ్’ మాట
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అప్పుడే ‘ట్యాంపరింగ్’ జపం ప్రారంభించారు. ఈ నెల 11న జరిగిన పోలింగ్ లో పలు చోట్ల ఈవీఎంల్లో సమస్యలు తలెత్తినా పోలింగ్ మాత్రం రికార్డు స్థాయిలో నమోదు అయింది. అయితే ఈ అంశాన్ని పక్కన పెట్టేసిన చంద్రబాబు ఈసీపై యుద్ధం అంటూ శనివారం నాడు ఢిల్లీ వెళ్ళిన విషయం తెలిసిందే. అంతే కాదు..ఏకంగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని అనుమానిస్తున్నట్లు వ్యాఖ్యానించటం ఆసక్తికర పరిణామంగా మారింది. ఓ వైపు టీడీపీకి వేవ్ ఉందని ...130 సీట్లతో అధికారంలోకి వస్తామని చెబుతూ అప్పుడే ట్యాంపరింగ్ అనటం వెనక మతలబు ఏమై ఉంటుంది అన్న అంశంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ బృందం సీఈసీ సునీల్ అరోరాతో సమావేశం అయింది. అనంతరం బయట మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ చరిత్రలో ఇన్ని అరాచకాలు ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో అధికారులను ఇష్టారాజ్యంగా బదిలీ చేసిన రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారని వ్యాఖ్యానించారు. దీంతో రాష్ట్రంలో ప్రజా జీవనం స్తంభించి పోయిందని ఆరోపించారు.

ప్రజల ప్రాధమిక హక్కులకు భంగం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రధాని మోడీ దర్శకత్వంలో ఈసీ పనిచేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్యాలెట్ పద్దతిలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించే పద్దతి మళ్ళీ రావాలని చంద్రబాబు కోరారు. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరించి కారణాలు చెప్పకుండా అధికారులను బదిలీ చేసిందని విమర్శించారు. ఈవీఎంల మొరాయింపుపై వైసీపీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. దేశంలో ఎక్కడైనా తెల్లవారు జాము వరకూ పోలింగ్ జరిగిందా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం. సీబీఐ కేసుల్లో ఉణ్న ఐఏఎస్ ను సీఎస్ గా ఎలా నియమిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో హత్యలు జరిగినా..మహిళలపై దాడి జరిగినా కూడా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో ఈవీఎంలు విఫలమవటం వెనక మతలబు ఏమిటి? అని ప్రశ్నించారు. తాను ఆదివారం కూడా ఢిల్లీలోనే ఉండి జాతీయ పార్టీల దృష్టికి ఈవీఎంల అంశాన్ని తీసుకెళతానని చంద్రబాబు తెలిపారు.

Next Story
Share it