Telugu Gateway
Politics

మూగబోయిన మైక్ లు

మూగబోయిన మైక్ లు
X

కీలక అంకం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ లో హైఓల్టేజ్ లో సాగిన ఎన్నికల ప్రచారం ముగిసింది. తెలంగాణలో కేవలం లోక్ సభ ఎన్నికలే కావటంతో ఏపీతో పోలిస్తే ఇక్కడ అంత హంగామా లేదనే చెప్పొచ్చు. పోలింగ్ శాతం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఏపీలో అసెంబ్లీతోపాటు లోక్ సభ ఎన్నికలు ఉండటంతో ప్రధాన పార్టీలు అన్నీ తాడో పేడో అన్న రీతిలో సర్వశక్తులు ఒడ్డి పోరాడాయి. అధికార టీడీపీ తరపున తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విస్తృతంగా పర్యటించారు. నారా లోకేష్, బాలకృష్ణలు అక్కడక్కడ ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేసినా..వీరిద్దరూ కూడా ఎక్కువ శాతం తమ తమ సొంత నియోజకవర్గాలపైనే ఫోకస్ పెట్టారు. చంద్రబాబు ఎక్కువగా తన పాలన కంటే ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కెసీఆర్, ప్రతిపక్ష నేత జగన్ లనే టార్గెట్ చేసి ప్రచారం పూర్తి చేశారు.

ఇక వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీ తరపున ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ప్రచారం చివరి దశలో జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కూడా తమ వంతు ప్రచారం నిర్వహించారు. జగన్ ఎక్కువగా ప్రభుత్వ వైఫల్యాలు..ప్రభుత్వంలో సాగిన అవినీతి, అక్రమాలనే టార్గెట్ చేసుకుని ముందుకెళ్ళారు. జగన్ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర కూడా వైసీపీకి ఓ సానుకూల అంశంగా మారే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే లోక్ సభ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ లే కీలక పాత్ర పోషించారు. ఒకప్పుడు టీఆర్ఎస్ లో వెలుగు వెలిగిన హరీష్ రావు ఈ సారి మాత్రం పూర్తిగా పక్కన పెట్టిన పరిస్థితి.

Next Story
Share it