Telugu Gateway
Politics

తూర్పు ‘మార్పు’ సూచిస్తోంది

తూర్పు ‘మార్పు’ సూచిస్తోంది
X

ఏ రాజకీయ పార్టీకి అయినా అధికారంలోకి రావాలంటే తూర్పు గోదావరి జిల్లా అత్యంత కీలకం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధిక నియోజకవర్గాలు ఉన్న జిల్లా ఇదే. తూర్పు గోదావరిలో 19 నియోజకవర్గాలు ఉంటే..పశ్చిమ గోదావరిలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చే వారికీ ఈ రెండు జిల్లాలు అత్యంత కీలకం. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి అనుకూల వాతావరణం స్పష్టంగా కన్పిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో ఈ సారి ప్రతిపక్ష వైసీపీకి పెద్ద ఎత్తున సీట్లు దక్కే పరిస్థితి కన్పిస్తోంది. క్షేత్ర స్థాయి పరిశీలనలో తేలిన దాని ప్రకారం ఈ ఎన్నికల్లో వైసీపీ అమలాపురం, తుని, ముమ్మడివరం, పత్తిపాడు, పిఠాపురం, రంపచోడవరం, జగ్గంపేట, పెద్దాపురం, రాజమండ్రి రూరల్, పి. గన్నవరం, అనపర్తి ప్రస్తుతానికి వైసీపీ గ్యారంటీగా గెలిచే సీట్లుగా చెబుతున్నారు. మరికొన్ని చోట్ల పోటీ నువ్వా..నేనా అన్న తీరుగా ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఎన్నికల్లో వైసీపీ 10 నుంచి 12 సీట్లు తక్కువ కాకుండా దక్కించుకునేలా ఉంది. మిగిలిన సీట్లను టీడీపీ, జనసేన పంచుకోనున్నాయి. జనసేనకు ఇక్కడ రెండు సీట్లు గ్యారంటీగా గెలిచే అవకాశం కన్పిస్తోంది.

ఈ లెక్కన టీడీపీ కేవలం ఐదు సీట్లకు పరిమితం కావాల్సిన పరిస్థితి కనపడుతోంది. ఈ పరిణామాల నేథప్యంలో ఏపీలో టీడీపీ అధికారం దక్కించుకోవటం సాధ్యం అవుతుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే అత్యంత కీలకమైన ఉభయ గోదావరి జిల్లాల్లోనే అధికార పార్టీకి భారీ ఎత్తున సీట్ల గండిపడుతోంది. ఇక్కడ పడే గండిని ఎక్కడా పూడ్చుకునే పరిస్థితి కన్పించటం లేదు. తూర్పు గోదావరి జిల్లాలోనూ రైతు రుణ మాఫీ సరిగా అమలు చేయక పోవటం రైతుల్లో తీవ్ర నిరాశను మిగల్చగా..ఎమ్మెల్యేల అడ్డగోలు అవినీతి పెద్ద సమస్యగా మారింది. పలు నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి మూడవ స్థానానికి పడిపోయే పరిస్థితి కన్పిస్తోందని చెబుతున్నారు. కొన్ని చోట్ల పోటీ ప్రధానంగా వైసీపీ, జనసేన మధ్యే సాగనుంది. తెలుగుదేశం, జనసేనలు అంతర్గతంగా ఒప్పందం చేసుకున్నాయనే ప్రచారం అటు టీడీపీతోపాటు ఇటు జనసేనను కూడా రాజకీయంగా దెబ్బతీయనుంది.

Next Story
Share it