Telugu Gateway
Politics

ఏపీలో మేనిఫెస్టోలకు ‘కాపీ’ల భయం

ఏపీలో మేనిఫెస్టోలకు ‘కాపీ’ల భయం
X

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలు ఇంత వరకూ తమ మేనిఫెస్టోలను ప్రకటించలేదు. ఎందుకంటే అందరికీ కాపీల భయం. వాస్తవంగా చెప్పుకోవాలంటే తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ మధ్య కాపీలు కొట్టడంలో చాలా స్పీడ్ అందుకున్నారు. జగన్ తాము అధికారంలోకి వస్తే పెన్షన్ రెండు వేలు చేస్తామంటే ..చంద్రరాబు ఆ వెంటనే రెండు వేలు అని ప్రకటించి ఎన్నికల ముందు అమలు ప్రారంభించారు. ఆ తర్వాత జగన్ నేను దశల వారీగా పెన్షన్ మూడు వేలు చేస్తానంటే..నేను కూడా అంతే అంటూ చంద్రబాబు ఇప్పుడు పదే పదే ప్రతి బహిరంగ సభలో ప్రకటించారు. జగన్ ఎప్పటి నుంచో తాము అధికారంలోకి వస్తే ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేస్తామని ప్రకటిస్తే ..ఐదేళ్ల పాటు చంద్రబాబు సాధ్యం కాదంటూ ప్రకటించారు. తీరా ఇప్పుడు తాను కూడా ఉద్యోగులకు అండగా ఉంటానని..సీపీఎస్ రద్దు చేస్తానని ప్రకటించారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. మేనిఫెస్టో కూడా రెడీ అయిపోయింది. వైసీపీ కూడా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ వేసి..పలు దఫాలు గా చర్చించింది. ఆ పార్టీ మేనిఫెస్టో కూడా రెడీ అయింది. ఎన్నికలకు ఇంకా పట్టుపని పది రోజులు లేకపోయినా కూడా రెండు ప్రధాన పార్టీలు ఇంత వరకూ తమ మేనిపెస్టోలను ప్రకటించలేదు. అధికార పార్టీ కూడా విచిత్రంగా ప్రతిపక్ష పార్టీ మేనిఫెస్టో కోసం చూస్తూ ఉండటం విచిత్రంగా ఉందని..చేసింది చెప్పుకుని..తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పుకోవాలి కానీ..ఇలా ప్రతిపక్ష మేనిఫెస్టో కూడా చూస్తూ కూర్చోవటంతోనే తమ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it