Telugu Gateway
Politics

చంద్రబాబు సమీక్షలు..చిక్కుల్లో అధికారులు

చంద్రబాబు సమీక్షలు..చిక్కుల్లో అధికారులు
X

ఏపీలో అధికారుల పరిస్థితి విచిత్రంగా తయారైంది. ఎన్నికలు ముగిసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న సమీక్షలు ఏకంగా ఐఏఎస్ లకే చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. సీఎం సమీక్షకు వెళ్ళకపోతే ఆయనకు కోపం..వెళితే ఈసీ సీరియస్. మధ్యలో ఎలా? అన్నదే వీళ్ళ టెన్షన్. తాజాగా చంద్రబాబునాయుడు నీటిపారుదల శాఖ, సీఆర్ డీఏ అధికారులతో సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇది చూసిన విపక్షాలు ఇదెక్కడి చోద్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేయటం..ఈసీకి ఫిర్యాదు కూడా చేశాయి.

ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది కూడా ఈ సమీక్షలపై సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నుంచి నివేదిక కోరారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా..అసలు సమీక్షలకు ఎలా వెళ్ళారో సమాధానం ఇవ్వాలని సాగునీటి శాఖ, సీఆర్ డీఏ అధికారుల సీఎస్ నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల ఫైటింగ్ సాగుతోంది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ తరహాలో వ్యవహరించలేదని అధికార వర్గాలు తెలిపాయి. రాజకీయాల్లో ఎంతో సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబుకు ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఇలా అధికారిక సమీక్షలు..అది ఎన్నికలు పూర్తయిన తర్వాత చేయకూడదని తెలియదా? అని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it