Telugu Gateway
Politics

సీఈసీ కంటే చంద్రబాబే సుప్రీమా?!

సీఈసీ కంటే చంద్రబాబే సుప్రీమా?!
X

‘మాజీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠా ఏ తప్పూ చేయలేదు. ఆయన్ను బదిలీ చేసినప్పుడు మీరెక్కడున్నారు’. ఇదీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులకు తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేస్తున్న ప్రశ్న. నిజంగానే అనిల్ చంద్ర పునేఠా ఏ తప్పూ చేయలేదా? ఓ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంత దారుణంగా ప్రజలను ఎలా తప్పుదారి పట్టిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అప్పటి ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏ బీ వెంకటేశ్వరరావును బదిలీ చేయాలని ఆదేశించింది. ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మళ్ళీ ఆ మరుసటి రోజే మళ్ళీ ఏ బీ వెంకటేశ్వరరావును అదే పోస్టులో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతే కాదు ఏకంగా సీఈసీ నిర్ణయంపై ప్రభుత్వం హైకోర్టుకు ఎందుకు వెళ్లింది. ఎవరు చెపితే సీఎస్ సీఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్టానికి అనుమతించారు?. ఇందులో అప్పటి సీఎస్ అనిల్ చంద్ర పునేఠా పాత్ర లేదా?. ఏ బీ వెంకటేశ్వరరావు బదిలీ వ్యవహారంతోపాటు సీఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకెళ్ళటం తీవ్ర ఆక్షేపణీయమని ఉన్నతాధికారులే చెబుతున్నారు.

ఎన్నికల సమయంలో రాష్ట్ర యంత్రాంగం అంతా సీఈసీ పరిధిలోనే ఉంటుందనే విషయం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు తెలియదా?. అందుకు కాదా?. సీఈసీ అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేసింది. కానీ చంద్రబాబు మాత్రం పునేఠా బదిలీ అనేది ఓ దోశద్రోహం అన్న తరహాలో నిత్యం అదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. పునేఠా అయితే సీఈసీ ఆదేశాలను కూడా ధిక్కరించి తాను ఏది చెపితే అది చేస్తారనే చంద్రబాబు ఆయన్ను సీఎస్ గా పెట్టుకున్నట్లు కన్పిస్తోందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అలా చేసే ఇఫ్పుడు పునేఠా తన కెరీర్ లో మాయని మచ్చను తెచ్చుకున్నారని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఈవీఎంల మొరాయింపు, ఇతర సమస్యలపై చంద్రబాబు అభ్యంతరాలను ఎవరూ తప్పుపట్టరని..కానీ చంద్రబాబు కేవలం పునేఠా తోపాటు ఇతర అధికారుల బదిలీలపై ఇంత రాద్ధాంతం చేయటం ద్వారా ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it