Telugu Gateway
Politics

మళ్ళీ చంద్రబాబు ‘రివర్స్ గేర్’ ఏంటి?!

మళ్ళీ చంద్రబాబు ‘రివర్స్ గేర్’ ఏంటి?!
X

బహుశా..దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏపీ సీఎం చంద్రబాబులా సీఈవో కార్యాలయానికి వెళ్ళి అంతలా రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారితో అలా మాట్లాడి ఉండరు. అంతే కాదు..ఏకంగా స్వరాష్ట్ర సీఎస్ ను కోవర్ట్...సహ నిందితుడు వంటి పరుష వ్యాఖ్యలు చేసి ఉండరు. ఇవన్నీ కూడా చంద్రబాబు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారనే విషయం స్పష్టంగా కన్పిస్తోంది. ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆదేశాలను కాదని..చంద్రబాబు చెప్పినట్లు ఏ బీ వెంకటేశ్వరరావుకు మళ్ళీ పోస్టింగ్ ఇవ్వటం పునేఠా తప్పు కాదా?. అంతే కాదు..ఏకంగా సీఈసీ నిర్ణయాన్ని ప్రభుత్వపరంగా కోర్టులో సవాల్ చేయటానికి అనుమతి ఇఛ్చింది ఎవరు?. సీఎస్ కాదా?. సీఈసీ పరిధిలో పనిచేయాల్సిన సీఎస్ అలా కాకుండా ..చంద్రబాబు ఏది చెపితే అది చేయటం కరెక్ట్ అవుతుందా?. . ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడిన సీఎస్ పునేఠా ఏ తప్పూ చేయలేదట. ఆయన మార్చటం తప్పిదం అంట. ఇది చంద్రబాబు జడ్జిమెంట్. అంతే కాదు.. ఐదేళ్ళ పాటు సాగునీటి శాఖ మొదలుకుని పలు శాఖల్లో అడ్డగోలుగా నిబంధనలను ఉల్లంఘించి ఇష్టానుసారం వ్యవహరించింది చంద్రబాబు సర్కారే. అధికారులు నిబంధనలను అనుమతి ఇవ్వవని చెప్పినా..కేబినెట్ లో పెట్టి మరీ అడ్డగోలుగా అక్రమాలకు తెరలేపారు.

నిబంధనలు అనుమతించవని చెప్పిన అధికారులను బెదరించి మరీ పనులు చేయించుకున్నారు. ఇప్పుడు అదే చంద్రబాబు తాను వ్యవస్థలను కాపాడుతున్నానని..ఎవరో ధ్వంసం చేస్తున్నారని ఆరోపించటమే విడ్డూరం. ఏ సీఎం చేయని విధంగా సొంత అధికారులపై రాజకీయ కారణాలతో విమర్శలు చేసిన చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు మాట మార్చుతున్నారు. కుటుంబ పెద్దగా మాట్లాడానని..తనకు వ్యక్తిగతంగా ఎవరిపై కోపం లేదని కొత్త పల్లవి అందుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల్లో 80 నుంచి 90 శాతం వరకూ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేశారని చెబుతున్నారు. రకరకాల కారణాలతో చంద్రబాబు తీరును ఉద్యోగులు వ్యతిరేకిస్తుండగా..ఎన్నికల ముందు ఓ విడుదలైన ఓ వీడియో చంద్రబాబుపై ఉద్యోగుల్లో వ్యతిరేకతను పీక్ కు తీసుకెళ్ళింది.

ఏ విషయంలో అయినా మాట మార్చటం చంద్రబాబు చేసినంత ఈజీగా మరెవరూ చేయలేరు. అందులో భాగంగానే శనివారం నాడు చంద్రబాబు తిరుపతిలో మాట్లాడుతూ...వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ఎజెండాలను ప్రజాస్వామ్యంపై రుద్దాలని చూడటం సరికాదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది. ఐదేళ్లలో చాలా చేశాం. అందరినీ సమానంగా చూశాను. సమర్థులైన అధికారులకు మంచి స్థాయిని కల్పించాను. దానికి తగినట్టే మీరంతా కష్టపడ్డారు. గత ఐదు సంవత్సరాలు అందరం కలిసి పనిచేశాం. కాబట్టే రాష్ట్రానికి 750 అవార్డులు లభించాయి. ఈ విజయం నా ఒక్కడిదే కాదు. కష్టపడి పనిచేసిన ఉద్యోగులు, అధికారులు అంటూ అనునయింపు వ్యాఖ్యలు చేశారు. వీటి వెనక లక్ష్యం ఏమిటో?!

Next Story
Share it