సాగులోకి రెండు కోట్ల ఎకరాలు..టీడీపీ మేనిఫెస్టో విడుదల

ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు ఒకే రోజు 2019 ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేశాయి. తొలుత వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తమ మేనిఫెస్టోను విడుదల చేయగా..తర్వాత టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము తిరిగి అధికారంలోకి వస్తే ఏపీలోమొత్తం రెండు కోట్ల ఎకరాల భూమిని సాగులోకి తీసుకొస్తామని ప్రకటించారు. అదే సమయంలో రైతులకు ఉచిత పంటల భీమా, ఇంటర్ విద్యార్ధులకు లాప్ టాప్ లు, చంద్రబాబు బీమా మొత్తాన్ని పది లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. పెళ్ళికానుకను లక్ష రూపాయలకు పెంచటంతోపాటు..బీసీలు, ఆదివాసీలకు ప్రత్యేక బ్యాంక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏపీలోని ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘మీ భవిష్యత్.. నా బాధ్యత’ పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు.
అమరావతిలోని సీఎం అధికారిక నివాసంలో మేనిఫెస్టోను చంద్రబాబు ప్రకటించారు. రైతులతో పాటు కౌలుదారులకు కూడా అన్నదాత సుఖీభవ అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయటంతోపాటు..ప్రైవేట్ రంగంలోనూ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని ఐదు లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. రైతులందరికి ఉచితంగా పంట భీమా కల్పించటంతోపాటు..రైతులకు పగటి పూట 12 గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. ఐదు వేల కోట్ల రూపాయలతో రైతులకు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు.
టీడీపీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు...
ప్రతి మండలం, పట్టణాల్లో చిన్న, మధ్యతరహా పారిశ్రామిక పార్కులు
ప్రతి ఏటా అన్నదాత సుఖీభవ కార్యక్రమం
రైతులకు వడ్డీలేని రుణాలు
రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
వ్యవసాయాన్ని ఉపాధిహామీకి అనుసంధానం
కోటి ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ అభివృద్ధి
మాదిగలు, రెల్లి, యానాది కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు
ఐదేళ్లలో రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా పరిష్కారం
విదేశీ విద్య కోసం పేద విద్యార్థులకు రూ. 20 లక్షలు
ఆదివాసీల కోసం ప్రత్యేక బ్యాంక్ ఏర్పాటు
ఇంటర్మీడియట్ నుంచి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు
మత్స్యకారుల క్రాప్ హాలిడేకి రూ.10 వేలు సాయం
వడ్డెర, బ్రాహ్మణ వర్గాలకు ఎమ్మెల్సీ పదవులు
2 కోట్ల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే లక్ష్యం
విద్యుత్ వాహనాలను ప్రమోట్ చేస్తాం
ప్రతి గ్రామం నుంచి మెయిన్‌రోడ్డుకు బీటీ రోడ్డు వేస్తాం
పట్టణాల్లో తోపుడుబండ్లకు ఇబ్బంది లేకుండా చేస్తాం
తిరుపతికి ఎలక్ట్రానిక్ హబ్ ఏర్పాటు
విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు
వైద్యంలో రూ.5లక్షల వరకు ఉచితం సాయం