Telugu Gateway
Politics

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందా?

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందా?
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ నేతలకు కూడా ఇదే అనుమానం వస్తోంది. ఎందుకంటే ఆయన ఎన్నికల ముందు ఎడాపెడా ఇస్తున్న హామీలు చూసి పార్టీ నేతలే నివ్వెరపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత రెండు రోజుల నుంచి చంద్రబాబు చెబుతున్న ఇంటర్మీడియట్ పూర్తయిన వారికి కూడా నిరుద్యోగ భృతి హామీ అందరి మైండ్ బ్లాంక్ చేస్తోంది. అసలు చంద్రబాబు రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్లదలచుకున్నారు ఇలాంటి హామీలతో అని అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గెలుపు కోసం ఎలాంటి హామీలైనా ఇస్తారా?. అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ అనుభవం లేని..పాలన అనుభవం లేని వ్యక్తులు ఇలాంటి హామీలు ఇచ్చారంటే అర్ధం చేసుకోవచ్చు అని..కానీ దేశంలో అత్యంత సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ఇలాంటి హామీలు ఇవ్వటం చూసి అందరూ విస్తుపోతున్నారు. నిరుద్యోగ భృతి అన్న దానికే అర్ధం లేకుండా ఇంటర్మీడియట్ వారికి కూడా ఈ స్కీమ్ కింద డబ్బులిస్తామని ఎలా ప్రకటిస్తారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అంటే చంద్రబాబునాయుడు ఏపీలోని విద్యార్ధులకు ఏమి చెప్పదలచుకున్నారు.

అందరూ ఇంటర్మీడియట్ చదివి ఇక విద్య ఆపమని చెప్పదలచుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఆకర్షణీయమైన విధానాలు తీసుకొచ్చి పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెంచే మార్గాన్ని చూపించాలి కానీ...ఇలా ఎంత కాలం ప్రజలు కట్టిన పన్నులను పంచిపెడతారని ఓ అధికారి వ్యాఖ్యానించారు. స్వయం ఉపాధి అవకాశాలు..ఉద్యోగాల కల్పన మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం చూపించగలదని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబునాయుడు ఎల్ కె జీ విద్యార్ధులకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేస్తున్నారు. గత ఎన్నికల ముందు ఇఛ్చిన నిరుద్యోగ భృతి హామీని కూడా చంద్రబాబు అపహస్యం చేశారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెల నెలా 2000 రూపాయలు ఇస్తామని చెప్పి..ఎన్నికల ఏడాదిలో అమలు ప్రారంభించారు. అదీ తొలుత వెయ్యి రూపాయలకు కోసేసి.ఆ తర్వాత ఎన్నికలు వస్తున్నాయని 2000 రూపాయలకు పెంచారు.

Next Story
Share it