Telugu Gateway
Politics

చంద్రబాబు చేతులెత్తేశారా!?

చంద్రబాబు చేతులెత్తేశారా!?
X

సీన్ వన్.

నా ఓటు ఎవరికి పడిందో నాకే తెలియదు. చంద్రబాబు

అందుకేగా వీవీ ప్యాట్ లో చూసుకోమంది. చంద్రబాబు మరి అలా చూసుకోలేదా?. చూసుకుని కూడా కావాలనే అలా మాట్లాడుతున్నారా?.

సీన్ 2. ఏపీలో టీడీపీ వేవ్ ఉంది.

తన ఓటు ఎవరికి వెళ్ళిందో తెలియని చంద్రబాబుకు ఏపీ ప్రజలు వేసిన ఓట్లు అన్నీ టీడీపీకి పడ్డాయని ఎలా చెప్పగలుగుతారు. ఈవీఎంల తీరును ఏ మాత్రం కనిపెట్టలేని చంద్రబాబు ఏపీ ప్రజల వేవ్ ను ఎలా గుర్తించగలిగారు?. తన ఓటు ఎటు వెళ్లిందో తెలియదు కానీ..ప్రజలు ఓట్లు ఎటు వెళ్లాయో తెలిసిపోయిందా?

ఎలా? చంద్రబాబు అలా ఎలా మాట్లాడగలరు. శుక్రవారం నాడు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి విలేకరుల సమావేశం చూసిన టీడీపీ నేతలు కూడా షాక్ కు గురయ్యారు. మే 23న ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పాల్సిన ఓటమికి కారణాలను చాలా ముందుగానే చెప్పినట్లు ఉందని ఓ నేత వ్యాఖ్యానించారు. సహజంగా ఎప్పుడైనా అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని..రిగ్గింగ్ చేసిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేయటం సహజం. కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్స్.

అధికార పార్టీనే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని..మోసాలు జరిగాయని చెబుతోంది. ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా కూల్ గా కూర్చుంది. నిజంగా చంద్రబాబు చెబుతున్నట్లు ఏపీలో టీడీపీకి వేవ్ ఉంటే..130 సీట్లు వచ్చే పరిస్థితి ఉంటే అది ఆ ఈవీఎంల ద్వారానే కదా?. మరి అలాంటప్పుడు వాటిపై ఉద్యమం ఎందుకు?. ఢిల్లీలో పోరాటం ఎందుకు?. ఏ మాత్రం లాజిక్ లేని మాటలు. పనిచేయని ఈవీఎంల రిపేర్లను కూడా చంద్రబాబు ‘మాయ’గా భావిస్తున్నారు. ఈ టెక్నీషియన్లకు ఉన్న విద్యార్హత ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ప్రజస్వామ్యం భవిష్యత్ ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్ పై పెడతారా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే చంద్రబాబు గత ఎన్నికల్లో ఈవీఎంలతోనే మంచి విజయాన్ని దక్కించుకున్నారు కదా?. అప్పుడు లేని భయం కేవలం ఇప్పుడే ఎందుకు వస్తుంది? అన్న ప్రశ్న తలెత్తటం సహజమే. అయితే ఏపీలోని పలు నియోజకవర్గాల్లో ఈవీఎంల్లో సమస్యలు తలెత్తిన మాట నిజమే. అదే సమయంలో గతంలో ఎన్నడూలేని రీతిలో అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరగటమూ నిజమే. అయినా సరే ఈవీఎంలను అడ్డం పెట్టుకుని ఎన్ని మాయలు చేయాలనుకున్నా ప్రజలు అంతే పట్టుదలతో ఓటు వేశారు కదా? అయినా చంద్రబాబుకు భయమెందుకు?. అయినా సరే చంద్రబాబు ఎందుకింత హైరానా పడుతున్నారు. అంటే ఫలితాలు కళ్ళ ముందు కనపడుతుంటే..గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Next Story
Share it