చంద్రబాబు నోట ‘ఓటమి’ మాట!

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో విచిత్ర విచిత్ర వ్యాఖ్యలు చేస్తూ వార్తలో నిలుస్తున్నారు. పలు ప్రచార సభల్లో ఆయన మాట్లాడే మాటలు టీడీపీ నేతల్లో కూడా కలవరం రేపుతున్నాయి. తాజాగా ఆయన చేసిన ఓటమి వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులను కూడా ద్రిగ్భాంతికి గురిచేశాయి. ఓడిపోయినా తనకేమి కాదని..తనకు భార్య, కొడుకు, కోడలు..మనవడు కూడా ఉన్నారంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. చంద్రబాబు నోట ఈ ఓటమి పాట ఏంటా అంటూ పోటీ చేసే అభ్యర్దులు కూడా అవాక్కు అవుతున్నారు. సహజంగా అధికారంలో ఉన్న పార్టీపై ప్రతిపక్షాలు ఎక్కువ స్థాయిలో విమర్శులు చేస్తుంటాయి. కానీ చంద్రబాబు మాత్రం జగన్ లోటస్ పాండ్ లో ఉండి తనపై కుట్రలు చేస్తున్నారని..ప్రజలే పోలీసులుగా మారి తనను రక్షించుకోవాలని వ్యాఖ్యానించటంతోనే ఆయన ఎంత ఆత్మరక్షణలో ఉన్నారనే విషయం అర్థం అవుతుంది. అంతే కాదు..ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ఇచ్చే హామీలు కూడా ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఏది పడితే అది మాట్లాడుతున్నారని..అంతిమంగా ఇది పార్టీకి మరింత నష్టం చేస్తుందనే భయం టీడీపీ నేతల్లోనే వ్యక్తం అవుతోంది.
పలు కీలక జిల్లాల్లో చంద్రబాబు సభలకు హాజరవుతున్న జనం చాలా తక్కువగా ఉండటం ఒకెత్తు అయితే...జగన్ సభలతోపాటు..ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ సభలకు భారీ ఎత్తున హాజరవుతున్న తీరు కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది. నిజంగా జగన్, షర్మిల, విజయమ్మ సభలకు సమీకరణ ద్వారానే జనాన్ని తరలించినట్లు అయితే..ఆర్థికంగా...పార్టీ పరంగా క్షేత్ర స్థాయిలో ఎంతో బలంగా ఉన్న టీడీపీ ఆ పని చేయలేదా? అన్న కూడా చర్చ కూడా సాగుతోంది. వైసీపీ నేతల సభలకు హాజరవుతున్న ప్రజలను కూడా చూసి కూడా ఓటర్లు మార్పు కోరుతున్నారనే సంకేతాలు స్పష్టంగా కన్పిస్తున్నాయని..ఇదే నిస్పృహతో చంద్రబాబు బ్యాలెన్స్ కోల్పోతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.