శ్రీరెడ్డి పోరాట ఫలితం వచ్చేసింది

అవును. నిజంగా ఇది శ్రీరెడ్డి విజయమే అని చెప్పుకోవాలి. కాకపోతే ఈ విషయంలో కూడా విపరీతమైన జాప్యం జరిగింది. సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సినిమాలో ఛాన్స్ ఇవ్వాలంటే సరెండర్ కావాలనే డిమాండ్ చాలా మంది పెడతారని టాక్ పరిశ్రమలో ఉంది. ఇదే అంశంపై శ్రీరెడ్డి కొద్ది రోజుల క్రితం బహిరంగంగా నిరసన ప్రదర్శన చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ బాధితులకు బాసటగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు టాలీవుడ్లో లైంగిక వేధింపులపై చర్యలు తీసుకునే కమిటీని నియమిస్తూ బుధవారం జీవో 984 జారీ చేసింది.
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కొర్పొరేషన్ ఛైర్మన్ రాంమోహన్ రావు ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇందులో టాలీవుడ్ ప్రతినిధులు నటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలతో పాటు నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయ లక్ష్మి సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత సుధాకర్ రెడ్డిని కూడా కమిటీ సభ్యులుగా నియమించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన మహిళలు తమను ఎవరైనా వేధిస్తే ఈ కమిటీ ముందు ఫిర్యాదు చేయవచ్చు.