Telugu Gateway
Andhra Pradesh

జగన్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా బుగ్గన!

జగన్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా బుగ్గన!
X

అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావటానికి మరో 23 రోజుల గడువు ఉంది. అధికార టీడీపీ బేలగా ఓ వైపు తమ పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఓటర్లు తెల్లవారు జామువరకూ ఉండి ఓట్లు వేశారని చెప్పుకుంటున్న తెలుగుదేశం టీమ్ బేల మాటలు మాట్లాడుతూ సొంత క్యాడర్ లోనే ‘ఓటమి’ తప్పదనే సంకేతాలు పంపుతోంది. సీనియర్ నేతలు కూడా పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో మన మాటలు చూస్తే లీడర్లు..క్యాడర్ కు కూడా అనుమానాలు వస్తున్నాయని చెప్పేశారట. అయితే ఈవీఎంలపై తన పోరాటం మన కోసం కాదు..దేశం కోసం అని చంద్రబాబు సెలవు ఇవ్వటంతో అంతా మౌనంగా ఉండిపోయారు. ఇదిలా ఉంటే వైసీపీ మాత్రం గెలుపు ధీమాతో ఉంది. అందుకే ఆ పార్టీ నేతలు పెద్దగా ఎక్కడా హడావుడి చేయకుండా ఫలితాల కోసం వేచిచూస్తున్నారు. పలు అంచనాలు కూడా వైసీపీ ఈ ఎన్నికల్లో 110 నుంచి 120 సీట్లు దక్కించుకునే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి.

అయితే వైసీపీ వర్గాల్లో అప్పుడు మంత్రివర్గ కూర్పుపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. జగన్ అధికారంలోకి వస్తే ఆయన కేబినెట్ లో కర్నూలు జిల్లాకు చెందిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ‘ఆర్ధిక మంత్రి’ అవుతారని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఛైర్మన్ గా ఉన్నారు. బుగ్గన వ్యవహారశైలి కూడా మిగిలిన నేతలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. అధికార పార్టీని విమర్శలు చేసే సమయంలో కూడా పరుషమైన వ్యాఖ్యలు చేయకుండా..వ్యంగంగా చెప్పాల్సిన మాటలను సూటిగా చెప్పటంలో ఆయన దిట్ట అని పేరుంది. పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని జగన్ ఆయనకు కీలకమైన ఆర్ధిక శాఖ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story
Share it