‘రైతులే టార్గెట్’..బిజెపి మేనిఫెస్టో

అత్యంత కీలకమైన లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించటం మరోసారి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న బిజెపి ‘రైతులను టార్గెట్’ చేసుకుంది. రైతులపై తన మేనిఫెస్టోలు పలు వరాలు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, హోంమంత్రి రాజ్‌నాధ్ సింగ్ సోమవారం పార్టీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. బీజేపీ తన మ్యానిఫెస్టోలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటి గత హామీలను ప్రస్తావిస్తూనే రైతులు, చిరువ్యాపారులను ఆకట్టుకునేందుకు పలు వాగ్దానాలు చేసింది.
చిన్న, సన్నకారు రైతులకు పెన్షన్‌తో పాటు వడ్డీ లేకుండా వ్యవసాయ రుణాలు అందిస్తామని హామీ ఇచ్చింది. రైతులందరికీ ఏటా రూ 6000 నగదు సాయం ప్రకటించింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఐదేళ్లలో అద్భుత పాలనను అందించారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. అభివృద్ధిలో దేశం దూసుకెళుతోందని, తమ హయాంలో 12 లక్షల కోట్ల స్కామ్‌లను వెలుగులోకి తెచ్చామని చెప్పారు. ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా భారత్ సత్తా చాటుతోందన్నారు.
మ్యానిఫెస్టోలో ముఖ్యాంశాలు
రామమందిర నిర్మాణానికి కట్టుబడి ఉంటాం
జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు
చిన్న, సన్నకారు రైతులకు పెన్షన్లు
రైతులకు ఏటా రూ 6000 నగదు సాయం
రైతులకు వడ్డీ లేకుండా రుణాలు
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు
వ్యవసాయం, గ్రామీణ రంగాల్లో రూ 25 లక్షల కోట్ల పెట్టుబడులకు హామీ
కిసాన్ సమ్మాన్ యోజన విస్తరణ
ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్ధల్లో భారత్‌ను ఒకటిగా తీర్చిదిద్దడం
ఉగ్రవాదంపై రాజీలేని పోరు
మౌలిక రంగంలో 100 లక్షల కోట్ల పెట్టుబడులు
చిన్న వ్యాపారులకు రూ 10 లక్షల ప్రమాద బీమా
2022 నాటికి హైవేలను రెట్టింపు చేయడం
జాతీయ వర్తక సంక్షేమ బోర్డు ఏర్పాటు
గుర్తింపు పొందిన వ్యాపారులకు క్రెడిట్ కార్డులు
అందరికీ విద్య