ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్!
అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం. ఏపీలో మొత్తం మీద ఐదు చోట్ల రీపోలింగ్ జరిగే అవకాశం కన్పిస్తోంది. అయితే దీనికి సంబంధించి సీఈసీ తన తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ద్వివేది మాత్రం జిల్లాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఐదు చోట్ల రీపోలింగ్ కు అనుమతి కోరారు. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో రెండేసి చొప్పున.. ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్‌కు స్థానిక కలెక్టర్లు ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి నివేదికలు పంపారు.
ఆయన వాటిని పరిశీలించిన అనంతరం ఐదు చోట్ల రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు. జిల్లా కలెక్టర్ల నివేదిక మేరకు ఈవీఎంల్లో లోపాలు తలెత్తిన ఐదు కేంద్రాలను గుర్తించిన.. సీఈసీకి పంపారు. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 94వ పోలింగ్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో ఉన్న 244వ పోలింగ్ కేంద్రం, నెల్లూరు అసెంబ్లీ పరిధిలోని ఇసుకపల్లిలో గల 41వ పోలింగ్ కేంద్రం, సూళ్లురుపేట నియోజకవర్గంలోని అటకానితిప్పలోని 197వ కేంద్రం, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని 247వ పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని సీఈసీకి సిఫారసు చేశారు.