Telugu Gateway
Politics

జగన్ ఫస్ట్ లిస్ట్ రేపే

జగన్ ఫస్ట్ లిస్ట్ రేపే
X

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ‘ఫస్ట్ లిస్ట్’ రెడీ చేశారు. వాస్తవానికి ఆయన మంగళవారం నాడే అభ్యర్ధులను ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. అయితే మంచి రోజు కాదని కొంత మంది సన్నిహితుల సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం ఉదయం పదిన్నర నుంచి పదకొండు మధ్యలోనే జగన్ వంద మందికిపైగా వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతంతో పోలిస్తే ఈ సారి అభ్యర్ధుల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని..‘గెలుపు’ అవకాశాలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కాకినాడ సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరించిన జగన్ అభ్యర్ధుల ప్రకటన తర్వాత పూర్తి స్థాయిలో ప్రచార రంగంలోకి దిగనున్నారు.

గత కొంత కాలంగా అధికార టీడీపీ నుంచి పలువురు నేతలు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీలో చేరటంతో ఓ రకమైన సానుకూల సంకేతాలు వచ్చినట్లు అయిందని భావిస్తున్నారు. కొంత మంది వైసీపీ నేతలు కూడా సీట్లు దక్కక పక్క చూపులు చూస్తున్నా..అధికార పార్టీ నుంచి రావటం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే టీడీపీకీ చెందిన ఎంపీలుగా ఉన్న అవంతి శ్రీనివాస్, రవీంద్రబాబులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఎంపీ తోట నరసింహం కూడా పార్టీ మారటానికి రెడీ అయిపోయారు. ఆయన ఏకంగా లోక్ సభలో పార్టీ నేతగా కూడా ఉన్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాలు అటు ఇటు దూకుళ్ళతో హాట్ హాట్ గా మారాయి.

Next Story
Share it