Telugu Gateway
Politics

పదవి కోసమే చంద్రబాబు పథకాలు

పదవి కోసమే చంద్రబాబు పథకాలు
X

‘అవి పేదలపై ప్రేమతో పెడుతున్న పథకాలు కావు. పదవిపై ప్రేమతో అమలు చేస్తున్న పథకాలు’ అని వైసీపీ నేత వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. నిజంగా చంద్రబాబుకు ప్రజలపై ప్రేమ ఉంటే ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచే ఎందుకు పథకాల హాంగామా చేస్తున్నారని ప్రశ్నించారు. యువతకు జాబు రావాలంటే బాబు పోవాలని..అందరూ బై బై బాబూ అని నినదించాలని కోరారు. ఈ ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో ఆయన కొడుకు లోకేష్‌కు మాత్రమే వచ్చింది ఉద్యోగం. ఈ పప్పుకు కనీసం జయంతికి, వర్ధంతికి తేడా కూడా తెలియదు. అటువంటి వ్యక్తి ఒకటి కాదు రెండు ఏకంగా మూడు శాఖలకు మంత్రి అయి కూర్చున్నారు. అ ఆలు రావు గానీ అగ్ర తాంబూలం నాకే కావాలన్నాడట ఎవరో. పప్పు తీరు కూడా అలాగే ఉంది. ఒక్క ఎన్నికలో కూడా గెలవని పప్పుకు ఏ అర్హత ఉందని చంద్రాబాబు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా. సీఎం కొడుకుకు మూడు జాబులు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగాల్లేవు. కనీసం నోటిఫికేషన్లు కూడా లేవు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా’ అని ప్రశ్నించారు. బస్సు యాత్ర లో భాగంగా షర్మిల శనివారం గుంటూరు సిటీలో జరిగిన ప్రచార ఎన్నికల సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా తమకు ఏ పార్టీతోనూ పొత్తులు లేవని.. సింహం సింగిల్‌గానే వస్తుందని స్పష్టం చేశారు. ఒక్కసారి రాజన్నను మనసులో తలచుకుని ఫ్యాను గుర్తుకు ఓటేయాలని కోరారు. తమ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా(గుంటూరు ఈస్ట్‌), ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విన్నవించారు. ‘ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారు. దాంట్లో ఒక్కటైనా నెరవేర్చారా. కాబట్టి ప్రతిఒక్కరూ చంద్రబాబును నిలదీయండి. అది మీ హక్కు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేస్తామని చెప్పి ఈ ఐదేళ్లలో ఒక్కరికైనా ఇచ్చారా? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేశారా. మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు ఇచ్చారా. విద్యార్థులకు ఐపాడ్లు ఇచ్చారా? లేదు. ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అని చెప్పి వంచించారు. ఐదేళ్లలో నెలకు రూ.2 వేల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ దాదాపు రూ.1.25 లక్షలు చొప్పున చంద్రబాబు బాకీ పడ్డారు. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి, పక్కా ఇళ్లు అన్నారు. ఎక్కడైనా కట్టించారా? చేనేతల మరమగ్గాలకు పూర్తి రుణమాఫీ అన్నారు. ఎన్నికలు పూర్తయ్యేలోపు బాకీ పడ్డ ఇవన్నీ మాకు ఇవ్వండి అని బాబును నిలదీయండి. అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it