పవన్ పొలిటికల్ డైరక్టర్ చంద్రబాబే

వైఎస్ షర్మిల జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ మంత్రి నారా లోకేష్ లపై పంచ్ లు వేశారు. పవన్ కళ్యాణ్ సినిమా హీరో అని..అక్కడ డైరక్టర్ ఏది చెపితే అది చేశారన్నారు. ఇక రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ డైరక్టర్ చంద్రబాబు అని..ఆయన ఏమి చెపితే అదే చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జయంతికి..వర్థంతికి తేడా తెలియని నారా లోకేష్ కు చంద్రబాబు అత్యంత కీలకమైన మూడు శాఖలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వం తన కొడుకుకు మాత్రం ఒకేసారి మూడు కీలక శాఖలు కట్టబెట్టిందని విమర్శించారు. వైఎస్సార్ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర ఉండేదని, అలాగే పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదువుకునేవారని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...ఆ తర్వాత ఆ హామీలను గాలికి వదిలేశారన్నారు. సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత రైతులను మోసం చేశారని విమర్శించారు. మొదటి అయిదు సంతకాల పేరుతో డ్రామాలు ఆడిన చంద్రబాబు...తొలి సంతకానికి అయినా ప్రాధాన్యత ఇచ్చారా అని సూటిగా ప్రశ్నించారు.
14వేల కోట్ల రూపాయలు ఉన్న పోలవరం ప్రాజెక్టు వ్యయాన్నిరూ.60వేల కోట్లకు పెంచారు. నామినేషన్ పద్ధతిలో బాబుకు కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చారు. అందుకే కేంద్రం నుంచి పోలవరాన్ని లాగేసుకున్నది నిజం కాదా?. పోలవరాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని మీరు చెప్పలేదా చంద్రబాబు? నేటికి అది పూర్తి కాలేదంటే అది మీ అసమర్థత కాదా? అని ప్రశ్నలు సంధించారు. అమరావతి అంటూ గ్రాఫిక్స్ చూపారు. కానీ ఒక్క శాశ్వత భవనం కట్టారా. చంద్రబాబు పేద విద్యార్థుల భవిష్యత్ ఖూనీ చేసింది నిజంకాదా. పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేసింది నిజం కాదా. డేటా చోరీ దోషులని ఇప్పటికి పట్టుకోలేదు, సిగ్గుగాలేదా?. బాబు, మోదీ జోడీ రాష్ట్రానికి అన్యాయం చేసింది వాస్తవం కాదా. ప్రత్యేక హోదా నీరుగార్చిన చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోరా. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చారా. ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా. ఎక్కడ చూసినా అవినీతి. చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చలేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తాయి అని మళ్ళీ కొత్త హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు చందమామ ని తెచ్చిస్తా అంటే ప్రజలు నమ్మాలా. నిప్పు నిప్పు అంటే తుప్పు నిప్పవుతుందా.
అసత్యానికి మారు పేరు చంద్రబాబు. చంద్రబాబు సూటిగా చెప్పండి...జగన్ అన్న ఊరురు తిరిగి హోదా కోసం పోరాడకపోతే నీ నోట హోదా మాట వచ్చేదా, చేతనైతే నిజం చెప్పు. చంద్రబాబు రోజుకొక మాట, పూటకో వేషం, మిమ్మల్ని చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలదించుకోవాలి. చంద్రబాబుకు వెన్నుపోటు, మోసం, అవినీతి, స్వార్ధ రాజకీయాలు, హత్యలు చేయడంలో అనుభవం ఉంది. 5 ఏళ్లలో కొన్ని వందల మందిని పొట్టన బెట్టుకున్నారు, రిషితేశ్వరి, వనజాక్షి విషయంలో చంద్రబాబు ఏం చేశారు. చంద్రబాబు అరాచకవాది కాదా. చంద్రబాబుని మించిన దుష్టుడు ఉండరు అని ఎన్టీఆర్ అన్నారు. ప్రజలు ఆలోచించండి. బాబు పాలనలో రాష్ట్రం ఎక్కడికి పోతుంది. ఈ ఎన్నికలు రాష్ట్రానికి, ప్రజలకు ముఖ్యం. ఆలోచించి ఓటు వేయండి అని సూచించారు.