Telugu Gateway
Politics

ప్రపంచాన్ని జయించిన బాబు..లోకేష్ ను మార్చలేకపోతున్నారే!

ప్రపంచాన్ని జయించిన బాబు..లోకేష్ ను మార్చలేకపోతున్నారే!
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మేథస్సు..ముందు చూపుతో దేశాన్ని..ప్రపంచాన్ని మార్చే క్రమంలో ఉన్నానని చెబుతుంటారు. అంతే కాదు..ఏపీకి చెందిన ఎవరైనా దేశంలో ఎక్కడైనా మంచి ఉద్యోగాలు సంపాదించారంటే అది తన వల్లే అంటున్నారు. అమెరికాలో తెలుగు వాళ్ళు ఐటి ఉద్యోగాలు సాధించటంలో కూడా తన కృషే ఉందని చెబుతున్నారు. అంతే కాదు..ఏపీని రాబోయే రోజుల్లో ప్రపంచ పటంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని చెబుతున్నారు. అవన్నీ నిజమే అనుకుందాం కాసేపు. ఇన్ని చేసిన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు తన కుమారుడు, మంత్రి నారా లోకేష్ ను ఎందుకు మార్చలేకపోతున్నారు. అమెరికాలో ఉద్యోగాలు సాధించిన తెలుగువాళ్ళ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకునే ఆయన..అమెరికాలో చదువుకుని వచ్చిన నారా లోకేష్ కనీసం ఏ మాత్రం చదువుకోని సామాన్య వ్యక్తిలాగా కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. ఎవరైనా చనిపోతే సంతాపం ప్రకటిస్తాం..బాధపడుతున్నాం అని చెబుతాం. కానీ నారా లోకేష్ మాత్రం ‘పరవశించిపోతాడట’. ఇది ఎక్కడ విచిత్రం. అసలు ఆ పదం పలకాలని లోకేష్ కు చెప్పిన ప్రపంచ మేథావి ఎవరు?. ఇదొక్కటే కాదు సుమా.

ఎన్నికల ప్రచారంలోనూ నారా లోకేష్ చేసే చమక్కులు ఎన్నో. ‘2014కు ముందు పెన్షన్ ఎంత?. మంగళగిరి ప్రచారంలో నారా లోకేష్ వేసిన ప్రశ్న ఇది. పెద్దగా స్పందన లేదు. వెంటనే అందరూ మర్చిపోయారు అంటూ వ్యాఖ్యానించారు లోకేష్. ఆ తర్వాత ఎవరో 200 రూపాయలు అని చెప్పారు. చాలీచాలని రెండు వందల రూపాయల పెన్షన్ ను పది రెట్లు పెంచి 1000 రూపాయలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిది’. ఇవీ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు. మంత్రి నారా లోకేష్ చెప్పిన దాంట్లో రెండు తప్పులు ఉన్నాయి. పది రెట్లు అంటే ఆ పెన్షన్ రెండు వేలు అవుతుంది. ఎన్నికల ముందే వెయ్యి రూపాయల పెన్షన్ ను చంద్రబాబు సర్కారు రెండువేలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజలనే మర్చిపోయారు అన్న నారా లోకేష్ ప్రస్తుతం తమ ప్రభుత్వం ఎంత పెన్షన్ ఇస్తుందో అన్న విషయం ఆయన కూడా కూడా మర్చిపోయి వెయ్యి రూపాయలు అని చెప్పుకొచ్చారు తన ఎన్నికల ప్రచారంలో. లోకేష్ చెప్పిన లెక్కల్లో తప్పు ఉంది....అసలు విషయంలోనూ తప్పే. మరి ప్రపంచాన్ని జయించిన చంద్రబాబు తన తనయుడు నారా లోకేష్ మాత్రం ఎందుకు ‘జయించలేకపోతున్నారు’?.

Next Story
Share it