‘వెరీ ఈజ్ ద వెంకటలక్ష్మీ’ మూవీ రివ్యూ
రాయ్ లక్ష్మీ. అందానికి అందం. అభినయానికి అభినయం ఉన్న నటి. కానీ ఓ సారి ట్రాక్ తప్పితే...ఇక అంతే. ఇది తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నోసార్లు నిరూపితమైంది. ఏ రకంగా చూసుకున్నా రాయ్ లక్ష్మీ సినీ పరిశ్రమలో ఓ రేంజ్ లో ఉండాలి. కానీ ఆమె ఎన్ని సినిమాలు చేసినా..ఎన్ని పాత్రలు పోషించినా ఆమెను విజయం మాత్రం వరించటం లేదు. తాజాగా ఆమె ‘ వెర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కూడ ఆశించిన ప్రయోజనం ఇవ్వలేదనే చెప్పొచ్చు. దీంతో మరోసారి రాయ్ లక్ష్మీని నిరాశే మిగిలింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే చంటిగాడు (ప్రవీణ్), పండుగాడు (మధు నందన్) బెల్లంపల్లి అనే ఊళ్లో పని పాట లేకుండా అల్లరి చిల్లరగా తిరిగే యూత్. ఊళ్లో జనాలను ఇబ్బంది పెడుతూ ఆనందపడే చంటి , పండు.. ఒక్కడి మాటే వింటారు. వాళ్లకు ఏ సమస్య వచ్చిన అతనే కాపాడుతుంటాడు. కానీ శేఖర్, గౌరీల ప్రేమ విషయంలో చంటి, పండు చేసిన పని కారణంగా శేఖర్ కూడా వారిని దూరం పెడతాడు. . ఆ సమయంలోనే బెల్లంపల్లి ఊరికి స్కూల్ టీజర్‌గా వెంకటలక్ష్మి వస్తుంది. బస్ దిగగానే సాయం చేయమని చంటి, పండులను అడుగుతుంది. ఆమె అందంపై ఆశపడ్డ చంటి, పండు వెంకటలక్ష్మికి వసతి ఏర్పాటు చేయటంతో పాటు అన్ని దగ్గరుండి చూసుకుంటారు. ఇద్దరిలో ఎవరో ఒకరు వెంకటలక్ష్మీని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకునే సరికి వెంకటలక్ష్మి మనిషి కాదు దెయ్యం అని తెలుస్తుంది.
అసలు దెయ్యంగా వచ్చిన వెంకటలక్ష్మీ ఎవరు..? వెంకటలక్ష్మి.. చంటి, పండులకు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? ఈ కథతో నాగంపేట వీరారెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? అన్నదే సినిమా. ప్రధాన పాత్రలో నటించిన రాయ్ లక్ష్మి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. భయపెట్టే సన్నివేశాలతో పాటు గ్లామర్ షోతోనూ అదరగొట్టింది. ప్రవీణ్, మధునందన్‌లు తమ పరిధి మేరకు బాగానే నటించారు. హీరో రామ్ కార్తీక్ మంచి నటన కనబరిచాడు. పూజితా పొన్నాడ గ్లామర్ షోలో రాయ్ లక్ష్మితో పోటీ పడింది. ఇతర పాత్రల్లో అన్నపూర్ణ, మహేష్, బ్రహ్మాజీ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇంట్రస్టింగ్ పాయింట్ తో సినిమాను ప్రారంభించిన దర్శకుడు కిశోర్, తరువాత అదే స్థాయిలో కథను నడిపించలేకపోయాడు. కామెడీ హారర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ, హారర్ రెండూ ఆకట్టుకోలేకపోయాయి. ఎక్కువగా అడల్ట్ కామెడీ మీద దృష్టి పెట్టి యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడే దర్శకుడు. సినిమాలో కాస్త పాజిటివ్‌గా అనిపించే అంశం హరి గౌర సంగీతం.
రేటింగ్. 1.75/5