అసలు టీడీపీలో ఏమి జరుగుతోంది?
ఇది ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్. ప్రధాన పార్టీల్లో టిక్కెట్ దక్కించుకోవటమే గొప్ప. అందునా అధికార పార్టీలో సీటు అంటే సహజంగానే దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆర్ధిక వనరులతో పాటు అన్ని హంగూ..ఆర్బాటాలు అందులో ఉంటాయి. అందులో తెలుగుదేశం లాంటి పార్టీలో అయితే ఎన్నో సాలభ్యాలు. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అదాల ప్రభాకర్ రెడ్డి టిక్కెట్ ఖరారు అయ్యాక వైసీపీలోకి జంప్ అయ్యారు. అక్కడ నెల్లూరు ఎంపీ బరిలో నిలిచారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టీడీపీ అధిష్టానం ఏ సీటు అంటే ఆ సీటు ఇవ్వటానికి సిద్ధపడింది. ఎంపీతోపాటు ఎమ్మెల్యే సీటు కు కూడా రెడీ అయింది. కానీ ఆయన కూడా వైసీపీలోకి జంప్ అయి..ఒంగోలు లోక్ సభ బరిలో నిలిచారు. ఇప్పుడు కర్నూలు జిల్లా శ్రీశైలం సీటు దక్కించుకున్న బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తాను పోటీ చేయలేనని చేతులెత్తేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని..తన సోదరుడికి టిక్కెట్ ఇవ్వాలని సూచిస్తున్నారు. దీంతో టీడీపీ అధిష్టానం షాక్ కు గురైంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రకటించిన గుంటూరు జిల్లా తెనాలి సీటులో కూడా మార్పులు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు అధిష్టానం ఇప్పటికే సీటు కేటాయించింది. కానీ ఇఫ్పుడు ఆయన్ను నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో బరిలో నింపే సన్నాహాలు చేస్తున్నారు. అందుకు ఆయన అంగీకరిస్తారా? లేదా అన్నది చూడాల్సిందే. ఇదిలా ఉంటే మంత్రి నారా లోకేష్ పోటీచేస్తున్న మంగళగిరి సీటును జనసేనతో పొత్తులో భాగంగా సీపీఎం నేతలు కోరగా...జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం సీపీఐకి కేటాయించారు. వాస్తవానికి మంగళగిరిలో సీపీఐ కంటే సీపీఎంకే ఎక్కువ బలం ఉంది. ఈ అంశాలన్నింటిని పరిశీలిస్తే ‘టీడీపీ-జనసేన’ల మధ్య రహస్య పొత్తు కొనసాగుతోందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. టీడీపీలో సీట్ల ఖరారు పూర్తయ్యే వరకూ ఇంకా ఎన్ని విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సిందే. ఓ వైపు ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీ అన్ని సీట్లు ప్రకటించేసి ప్రచారంలో హోరెత్తిస్తుంటే..టీడీపీ మాత్రం ఇంకా సీట్ల ఖరారులోనే మల్లగుల్లాలు పడుతోంది.