Telugu Gateway
Politics

పక్కింట్లో దొంగతనంపై కళా..పత్తిపాటి ఫిర్యాదు చేశారా?

పక్కింట్లో దొంగతనంపై కళా..పత్తిపాటి ఫిర్యాదు చేశారా?
X

టీడీపీ ఫిర్యాదు ‘దాకవరం అశోక్’ తరపునా?

‘ఎవరింట్లో అయినా దొంగతనం జరిగితే ఆ ఇంటి యజమాని ఫిర్యాదు చేస్తాడా? లేక వాళ్ళ బీరువాలో పెట్టిన మా బట్టలు కూడా పోయాయి అని పక్కింటోడు ఫిర్యాదు చేస్తాడా? ఒక వేళ పక్కింటోడు ఫిర్యాదు చేసినా అసలు యజమాని కూడా కంప్లయింట్ ఇవ్వాలి కదా?’ ఇంత చిన్న లాజిక్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం ఉన్న ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎలా మిస్ అయ్యారు?. ఇప్పుడు అందరి మదిలో ఇవే అనుమానాలు. అంటే ఈ కేసు నుంచి ఎలాగోలా తప్పించుకోవటం పాటు..ప్రజల అటెన్షన్ డైవర్షన్ కోసమే ఈ ఫిర్యాదు డ్రామా టీడీపీ ఆడిందనే విమర్శలు విన్పిస్తున్నాయి. మామూలుగా డేటా చోరీ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ, ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటి?. జగన్ కోసం తెలంగాణ ప్రభుత్వం ‘ఐటి గ్రిడ్’ కంపెనీ నుంచి టీడీపీ డేటాను చోరీ చేసింది అని. కాసేపు ఇదే నిజం అనుకుందాం. ఇలా జరిగిందని ఫిర్యాదు చేయాల్సింది ఎవరు?. కంపెనీ డైరక్టర్ దాకవరపు అశోక్. లేదా ఆయన కాకుండా మిగిలిన ఇద్దరు డైరక్టర్లు. కానీ దాకవరపు అశోక్ ఈ డేటా చోరీ వ్యవహారంలో పరారీ లో ఉన్నాడు.

తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేసినా సరే తప్పించుకు తిరుగుతున్నాడు. ఆయన కోసం తెలంగాణ పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ తరుణంలో ఏపీ టీడీపీ తరపున సాక్ష్యాత్తూ మంత్రులైన కళా వెంకట్రావు, పత్తిపాటి పుల్లారావులు, టీడీపీ ఎమ్మెల్యేలు గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి తెలంగాణ పోలీసులపై ఫిర్యాదు ఎలా చేస్తారు?. టీడీపీ తన డేటా ఎవరి దగ్గర దాచుకుంది. ఐటి గ్రిడ్ ప్రైవేట్ లిమిటెడ్ లో. తస్కరించారని చెబుతున్నది ఎక్కడ నుంచి? ఐటి గ్రిడ్ నుంచి?. మరి కేసు పెట్టాల్సింది ఎవరిపైనా?. ఐటి గ్రిడ్ పైనా?. తెలంగాణ పోలీసులపైనా?.

తెలంగాణ పోలీసులపై నిజంగా కేసు పెట్టాలన్నా కూడా ఐటి గ్రిడ్ కంపెనీ పెట్టాలి?. కానీ ఆ కంపెనీ డైరక్టర్ కన్పించకుండా పోవటం ఏంటి?. ఆయన తరపున వకాల్తా పుచ్చుకుని సాక్ష్యాత్తూ ఏపీ మంత్రులు పోలీసు స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేయటం ఏంటి?. దీంతోనే ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద మతలబు ఉందనే విషయం బహిర్గతం అవుతుంది?. ఏపీ టీడీపీ చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారు?. అసలు ఎవరి దగ్గర డేటా పోయింది?. ఎలా పోయింది చెప్పకుండా పోలీసులపై కేసు పెట్టడం సాధ్యమేనా?. ఈ ఫిర్యాదు ఆధారంగా ఏపీ పోలీసులు తెలంగాణలో విచారణ చేపట్టగలరా?. అది జరిగే పనేనా?. చూడాలి ఏమి జరుగుతుందో?

Next Story
Share it