లక్ష్మీస్ ఎన్టీఆర్ పై టీడీపీ ఫిర్యాదు
ఊహించిందే జరిగింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ పై టీడీపీ కార్యకర్త ఒకరు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ సినిమాలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నెగిటివ్ పాత్రలో చిత్రీకరించారని..ఈ సినిమా విడుదల అయితే ఓటర్లపై ప్రభావం చూపుతుందని దేవిబాబు చౌదరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీలో పోలింగ్ ముగిసే వరకూ సినిమా విడుదలను అడ్డుకోవాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదుపై రాష్ట్ర సీఈవోని కలవాల్సిందిగా సూచిస్తూ ఈ ఫిర్యాదును సీఈవోకు పంపారు.
ఈ సినిమా నిర్మాత రాకేష్ రెడ్డి వైసీపీలో ఉన్నారని..రాజకీయ ఉద్దేశాలతో ఈ సమయంలో సినిమాను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటామని..చట్టపరంగా తాము ముందుకెళతామని దేవిబాబు ప్రకటించారు. అయితే దీనిపై ఈసీ స్పందిస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే. రామ్ గోపాల్ వర్మ మాత్రం రో జుకో వీడియో విడుదల చేస్తూ సినిమాపై హైప్ ను పెంచుకుంటూ వెళుతున్నారు. ముందు ప్రకటించినట్లు ఈ సినిమా మార్చి 22న విడుదల అయితే మాత్రం రాజకీయంగా ప్రకంపనలు పుట్టించటం ఖాయంగా చెబుతున్నారు.