Telugu Gateway
Telangana

కొత్త మ‌లుపు తిరిగిన డేటా చోరీ కేసు

కొత్త మ‌లుపు తిరిగిన డేటా చోరీ కేసు
X

తెలుగు రాష్ట్రాల‌ను కుదిపేస్తున్న డేటా చోరీ కేసు కొత్త మ‌లుపు తిరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఐటి గ్రిడ్ వ‌ద్ద కేవ‌లం ఏపీ ప్ర‌జ‌ల డేటాను ఉంద‌ని అంద‌రూ భావించ‌గా..తెలంగాణ స‌ర్కారు ఏర్పాటు చేసిన సిట్ చీఫ్ స్టీఫెన్ ర‌వీంద్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఐటి గ్రిడ్ తెలంగాణ డేటాను కూడా చోరీ చేసింద‌ని తెలిపారు. ఈ కంపెనీ డైర‌క్ట‌ర్ అమ‌రావ‌తిలో ఉన్నా..అమెరికాలో ఉన్నా పట్టుకొచ్చి అరెస్ట్ చేస్తామ‌ని తెలిపారు. ఈ డేటా చోరీ కేసు విచారణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతుందని స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. డేటా చోరీ కేసులో ఇప్పటి దాకా జరిగిన దర్యాప్తుపై సమగ్రంగా చర్చించామ‌ని ర‌వీంద్ర మీడియాకు తెలిపారు. ఈ కేసులో దోషులను ప్రజల ముందుకు తీసుకువస్తాం. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు వెల్లడిస్తాం. ప్రజల వ్యక్తిగత సమాచారం అపహరణకు సంబంధించిన ఫిర్యాదుల్లో ప్రతి అంశంపై విచారణ చేస్తాం. అయితే ఈ కేసు దర్యాప్తునకు నిపుణుల అవసరం ఉంది. శాస్త్రీయ పద్ధతిలో సాంకేతిక పరిజ్ఞానం వాడి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. డేటా వ్యవహారంపై హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో దర్యాప్తు కొనసాగుతోంది.

డేటా వ్యవహారంపై ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ సహా మరేమైనా సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయా? అని పరిశీలిస్తాం. సేవామిత్ర యాప్ లో తెలంగాణకు సంబంధించిన డేటా కూడా ఇందులో మనకు దొరికింది. తెలంగాణకు చెందిన డేటా ఇక్కడ ఎందుకు ఉందనే అంశం కూడా పరిశీలిస్తున్నాం. తెలంగాణకు సంబంధించిన వివరాలతో ఏం చేస్తారనే విషయం కూడా తెలుసుకోవాలి. ఏపీకి చెందిన వివరాలను మ్యానిపులేట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. సేవామిత్ర ఫిచర్లను ఎందుకు తొలగించారనే విషయమై అశోక్ ను విచారిస్తాం. అశోక్ దోషి అని తేలితే కోర్టు ముందుంచుతాం. చట్టం ముందు అందరూ సమానులే. ఎవరైనా దోషులని ఆధారాలతో సహా తేలితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ఈ కేసులో అమెజాన్, గూగుల్ సంస్థలకు లేఖలు రాశాం. వీలైనంత త్వరగా కేసును విచారించి నివేదికను కోర్టు ముందు ఉంచుతామని స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు.

Next Story
Share it