Telugu Gateway
Politics

కెసీఆర్ పాలనపై ‘తిరగబడ్డ నిజామాబాద్ రైతులు’ !

కెసీఆర్ పాలనపై ‘తిరగబడ్డ నిజామాబాద్ రైతులు’ !
X

తెలంగాణ అంతా ఒకటి. నిజామాబాద్ రైతులు అంతా ఒకటి. సాక్ష్యాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ హామీ ఇఛ్చినా సరే..నిజామాబాద్ రైతులు మాత్రం ‘ససేమిరా’ అన్నారు. తమ హక్కుల సాధన కోసం నిజామాబాద్ పార్లమెంట్ బరిలో నామినేషన్ వేసి దేశ వ్యాప్తంగా ఓ చర్చకు తెరతీశారు. పసుపుతోపాటు.ఎర్రబొన్నలకు మద్దతు ధర ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ వందలాది రైతులు నామినేషన్ల దాఖలు చేయటంతో నిజామాబాద్ నియోజకవర్గం ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్ మారింది. ఇక్కడ నుంచి ప్రస్తుతం సీఎం కెసీఆర్ కుమార్తె కవిత ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆమె తిరిగి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. పసుపు బోర్డు ఏర్పాటుకు కవిత ఢిల్లీలో పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు. పెద్ద నోట్ల రద్దుతోపాటు జీఎస్టీ, ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ భేసరతుగా కేంద్రంలోని మోడీ సర్కారుకు మద్దతు ఇఛ్చింది. కానీ పసుపు బోర్డు సాధనలో మాత్రం విఫలమైంది.

అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహత విజయం సాధించిన కెసీఆర్ తెలంగాణలోని 17 లోక్ సభ సీట్లలో పదహారు సీట్లు ఏకపక్షంగా గెలిపించుకోవాలని చూస్తున్న తరుణంలో నిజామాబాద్ రైతులు ఓ సవాల్ విసిరినట్లు అయింది. ఈ పరిణామం టీఆర్ఎస్ కు..ముఖ్యంగా కెసీఆర్ కు మింగుపడని వ్యవహారమే. రైతుల వెనక బిజెపి ఉంది..ఇతర పార్టీలు ఉన్నాయని ఎంపీ కవిత ఆరోపిస్తున్నా కూడా..తెలంగాణలో టీఆర్ఎస్ ను ఢీకొట్టేపార్టీనే లేదని అందరూ భావిస్తున్న తరుణంలో రైతులు ఏదో ఒక పార్టీని నమ్ముకుని ఇంత సాహసం చేయగలరా?. అదీ కెసీఆర్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా?. అంటే అనుమానే అని చెప్పకతప్పదు.

తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రైతుల ఉద్యమాన్ని ఇటీవల వరకూ ఏ మాత్రం పట్టించుకోకపోగా..వారిని అణచివేతకు గురిచేసింది. దీంతో వీరంతా ఒక్కటై నామినేషన్ల అస్త్రాన్ని ఎంచుకున్నట్లు అర్థం అవుతోంది. రైతులు తమ చర్యల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రశ్నిస్తున్నట్లు అయింది. తాజాగా జరిగిన నిజామబాద్ ఎన్నికల ప్రచారంలో సాక్ష్యాత్తూ కెసీఆర్ వాళ్ల మాటలు..వీళ్ల మాటలు విని ఆగం కావొద్దు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఇప్పుడు ఏమీ చెప్పలేకపోతున్నానని..ఎన్నికలు అయ్యాక ఆదుకుంటామని బహిరంగంగా ప్రకటించారు. అయినా సరే రైతులు మాత్రం కెసీఆర్ మాటలను ఏ మాత్రం పట్టించుకోకుండా నామినేషన్ లు దాఖలు చేశారు. నిజామాబాద్ లో మొత్తం 245 నామినేషన్లు దాఖలు అయ్యాయి. దీంతో అక్కడ బ్యాలెట్ తో ఎన్నిక అనివార్యం అయ్యే అవకాశం కన్పిస్తోంది. ఈ పరిణామాలు ఎటుదారితీస్తాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it