టీడీపీలో ‘సత్తెనపల్లి’ హీట్
తెలుగుదేశం పార్టీలో గుంటూరు జిల్లా ‘సత్తెనపల్లి’ రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కోడెల శివప్రసాదరావు అభ్యర్ధిత్వాన్ని ఆమోదించేది లేదంటూ కొంత మంది టీడీపీ నాయకులు..కార్యకర్తలే రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. మరో వైపు కోడెల శివప్రసాద్ రావు మాత్రం సత్తెనపల్లి నాదే అంటూ ప్రకటించారు. పార్టీ తనకు రెండో సారి పోటీ చేసే అవకాశం ఇచ్చిందని ఈ నెల 22న నామినేషన్ వేయనున్నట్లు ఆయన మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. దీంతో సత్తెనపల్లి మరింత వేడెక్కింది. పార్టీ అధికారికంగా చెప్పకుండా సీటు ప్రకటించుకోవటానికి కోడెల ఎవరంటూ కొంత మంది నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
కుక్కను నిలబెట్టినా గెలిపించుకుంటాం కానీ..కోడెల ను అనుమతించబోమని..ఆయన కుటుంబ సభ్యుల వేధింపుల వల్ల తాము ఎంతో నష్టపోయామని టీడీపీ కేడర్ బహిరంగంగా ఆరోపిస్తోంది. అయితే తన కుటుంబ సభ్యుల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇస్తున్నట్లు కోడెల శివప్రసాద్ ప్రకటించటం విశేషం. సత్తెనపల్లి అసెంబ్లీ సీటును తాను 15 వేల మెజారిటీతో గెలుస్తానని కోడెల ధీమా వ్యక్తం చేశారు. మరి అధిష్టానం కోడెలను మార్చగలుగుతుందా?. లేదంటే సీటు చేజారిపోతుందా?. వేచిచూడాల్సిందే.