కెసీఆర్ తో సబిత భేటీ..టీఆర్ఎస్ లోకి జంప్

అసలే కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ. పార్టీ మార్పు విషయంలో వెనక్కి తగ్గారని భావించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాత నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. ఆమె కారెక్కాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా బుధవారం నాడు సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం అనంతరం కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలిపారు. చేవెళ్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్‌లో చేరతామని వెల్లడించారు.
కేసీఆర్‌ను కలిశాక పార్టీ మార్పుపై తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని అనిపించిందని పేర్కొన్నారు. కార్తీక్ రెడ్డికి చేవెళ్ల పార్లమెంట్ టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించినట్టుగా సమాచారం. అయితే ఎంపీ టిక్కెట్ తో పాటు సబితకు మంత్రి పదవి హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే కెసీఆర్ ఏమి హామీ ఇచ్చారన్నది కొద్ది రోజులు గడిస్తే కానీ బహిర్గతం అయ్యే అవకాశం లేదంటున్నారు. సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరే విషయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కీలక పాత్ర పోషించారు.