Telugu Gateway
Politics

మోడీ చేతిలో ‘కెసీఆర్ అవినీతి జాతకం’

మోడీ చేతిలో ‘కెసీఆర్ అవినీతి జాతకం’
X

ప్రధాని నరేంద్రమోడీ చేతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ‘అవినీతి జాతకం’ ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆయన మోడీ ఏమి చేసినా జై కొడుతున్నారని ధ్వజమెత్తారు. నోట్ల రద్దు, జీఎస్టీతో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డా కెసీఆర్ మాత్రం మోడీకే మద్దతు ఇచ్చారని విమర్శించారు. రాఫెల్ కుంభకోణంపై కెసీఆర్ ఒక్క సారి అయినా నరేంద్రమోడీని ప్రశ్నించారా? అని రాహుల్ శంషాబాద్ సభా వేదికగా ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోని ఏ పేదవాడిని వదలకుండా ‘కనీస ఆదాయం’ వచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోడీ డబ్బులు అన్నీ నీరవ్ మోడీ జేబులో వేస్తారని తాము మాత్రం పేదవాడి ఖాతాలో వేస్తామని ప్రకటించారు. నీరవ్‌ మోదీని పట్టుకుని మరీ డబ్బును పేదలకు పంచుతామని హామీ ఇచ్చారు. ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు వేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. అధికారంలోకి వచ్చిన కేవలం పదిరోజుల్లోనే రైతుల రుణమాఫీ చేస్తానని ఇప్పటికే తాను ప్రకటించిన విషయాన్ని మరోసారి ఆయన గుర్తు చేశారు. ఈ ఐదేళ్ల పాలనలో దేశాన్ని రెండు ముక్కలు చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారని రాహుల్ ఆరోపించారు.

దేశంలో " ఒక భాగాన్ని ధనవంతుల కోసం ఏర్పాటు చేశారు. మరో భాగంలో రుణమాఫీ కోసం రైతులు కోరుతున్నా అరుణ్ జైట్లీ పట్టించుకోలేదు. పెట్టుబడి వర్గానికి మోదీ సాయం చేస్తున్నారు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి వాళ్లు రూ. లక్షల కోట్లు దోచుకున్నారు. అప్పులు ఎగ్గొట్టి వాళ్లు దేశం వదిలివెళ్లిపోయినా చర్యలుండవు" అని మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాఫెల్‌ కొనుగోళ్లలో వేలకోట్లు అంబానీకి దోచిపెట్టే యత్నం చేశారు. రాఫెల్‌ వ్యయాన్ని రూ.1600 కోట్లకు పెంచి నష్టం చేకూర్చారు. అంబానీ జీవితంలో ఎప్పుడూ యుద్ధ విమానాల్ని తయారు చేయలేదు. 70 ఏళ్లుగా విమానాలు తయారు చేసిన చరిత్ర హెచ్‌ఏఎల్‌ది. మోదీ తప్పుచేశాడని హిందూ పత్రికలో వచ్చిందని అన్నారు. రైతు రుణ మాఫీతో పాటు అన్ని పంటలకు మద్దతు కల్పిస్తామని రాహుల్ హామీ ఇఛ్చారు. దేశభక్తుడిని అని చెప‍్పుకునే మోదీ... దేశానికి సంబంధించిన డబ్బులను 15మంది పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఇస్తారా?. దేశ రక్షణ విషయానికి వస్తే ప్రధాని మోదీ మాత్రం చైనా అధ్యక్షుడితో చెట్టాపట్టాలు వేసుకుని చాయ్‌ తాగుతుంటే ...చైనా మాత్రం డోక్లాంలో తన సైన్యాన్ని నిలిపిందన్నారు. సైనికులు మీద దాడి జరుగుతుంటే ...ప్రధాని మాత్రం తన మీద సినిమా తీయించుకుంటున్నారన్నారు. సైనికులు అమరులైనా మోదీ మూడున్నర గంటల సినిమాలో నటిస్తారని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

Next Story
Share it