Telugu Gateway
Politics

రాహుల్ లాస్ట్ బాల్ వర్కవుట్ అవుతుందా?

రాహుల్ లాస్ట్ బాల్ వర్కవుట్ అవుతుందా?
X

నరేంద్రమోడీని ఎలాగైనా గద్దె దింపి ప్రధాని పదవి చేపట్టాలనే ‘టార్గెట్’తో పనిచేస్తున్న రాహుల్ గాంధీ అన్ని దినుసులు దట్టించి ‘లాస్ట్ బాల్’ విసిరారు. మరి ఈ లాస్ట్ బాల్ కు మోడీ అనే వికెట్ పడుతుందా? లేదా తెలియాలంటే ఏప్రిల్ 23 వరకు వేచిచూడాల్సిందే. కాంగ్రెస్ పార్టీని తిరిగి విజయం దిశగా నడిపించేందుకు అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. పేదరిక నిర్మూలనకు ఇదే చివరి అస్త్రం అంటూ రాహుల్ గాంధీ కీలకాస్త్రాన్ని బయటకు వదిలారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే కనీస ఆదాయ భద్రత పథకాన్ని అమలుచేస్తామన్న రాహుల్‌ దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రకటించారు. కనీస ఆదాయ భద్రతా పథకంలో భాగంగా దేశంలో అత్యంత నిరుపేదలైన 20 శాతం కుటుంబాలకు ఏటా రూ.72,000 అందజేస్తామని రాహుల్‌ తెలిపారు. దేశంలోని ఐదు కోట్ల కుటుంబాలు, 25 కోట్ల మంది ప్రజలు ఈ పథకం ద్వారా ప్రత్యక్షంగా లబ్ధిపొందుతారని వెల్లడించారు.. కనీస ఆదాయ భద్రత పథకం ద్వారా దేశంలోని పేదరికంపై విజయం సాధిస్తామని రాహుల్‌ పేర్కొన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టో రూపకల్పనపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో చర్చించిన అనంతరం రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ..‘పలువురు ప్రముఖ ఆర్థికవేత్తలు, నిపుణులతో ఇప్పటికే చర్చించి వారి అనుభవాలు, అభిప్రాయాలకు అనుగుణంగా 5 నెలల పాటు అధ్యయనం చేసి కనీస ఆదాయ భద్రత పథకాన్ని రూపొందించామని తెలిపారు. ఇలాంటి చారిత్రాత్మక పథకం ప్రపంచంలో ఇప్పటివరకూ ఎక్కడా రూపుదిద్దుకోలేదు. పేదలకు న్యాయం జరుగుతుంది’ అని తెలిపారు ‘మేం పేదలకు న్యాయం చేయబోతున్నాం. దేశంలో ధనిక, పేద భారత్‌లను ప్రధాని మోదీ సృష్టిస్తున్నారు. దీన్ని కాంగ్రెస్‌ ఎన్నటికీ జరగనివ్వదు. భారత్‌ ఎప్పుడూ ఐక్యంగా ఉంటుంది. ప్రధాని ధనికులకు నగదును దోచిపెడితే, కాంగ్రెస్‌ పార్టీ పేదలకు నగదును అందజేస్తుంది’ అని తెలిపారు. కనీస ఆదాయ భద్రత పథకం అమలు చేసేందుకు కేంద్రం వద్ద తగిన నిధులు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Next Story
Share it