Telugu Gateway
Politics

పరీక్ష పేపర్ ఏదైనా ‘చంద్రబాబు ఆన్సర్ ఒకటే’!

పరీక్ష పేపర్ ఏదైనా ‘చంద్రబాబు ఆన్సర్ ఒకటే’!
X

విద్యార్ధులకు ఇది పరీక్షా కాలం. రాజకీయ నాయకులకు ‘ఎన్నికల పరీక్షా సమయం’. ఎవరి పరీక్షలకు వారు ప్రిపేర్ అవుతున్నారు. విద్యార్ధులు తాము రాసే పరీక్షల్లో సోషల్ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ కు చెందిన సమాధానాలే రాస్తారు. సైన్స్ అయితే సైన్స్ సమాధానాలే రాస్తారు. లేకపోతే ఏమి అవుతుందో వాళ్లకు తెలుసు. కానీ తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చదువుకున్నప్పుడు ఏమి చేశారో తెలియదు కానీ..ఇప్పుడు మాత్రం అన్ని ప్రశ్నలకు ఒకటే ఆన్సర్ చెబుతున్నారు. ఇది వింటున్న వారు..చూస్తున్న వారు షాక్ కు గురవుతున్నారు. అయినా సరే చంద్రబాబు సమాధానాలు మాత్రం మారటం లేదు. మీరు ఏ ప్రశ్ర అయినా వేయండి. ఆయన సమాధానం మాత్రం ఒకటే. అది ఏంటి అంటే ‘మోడీ. జగన్. కెసీఆర్’. ఏపీలో సకల సమస్యలకు మూలం వీళ్ళే. ఏపీలో ఎక్కడైనా ఎక్కువగా దోమలు తిరిగినా..ఏ సమస్య వచ్చినా కారణం వీళ్ళు ముగ్గురే.

ఈ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు చేసింది చెప్పుకోవటం కంటే ‘నెగిటివ్’ అంశాలపైనే ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు కన్పిస్తోంది. మోడీ, జగన్, కెసీఆర్ లు తమకు అడుగడుగునా అడ్డంకులు కల్పించినా సరే..అన్నింటిని అధిగమించి ఏపీని అగ్రభాగంలో నిలిపానని..మళ్ళీ గెలిపిస్తే మరింత ప్రగతి సాధిస్తానని నమ్మబలుకుతున్నారు చంద్రబాబు. మోడీని నమ్మి మోసపోయానని చంద్రబాబునాయుడు చెప్పటమే పెద్ద మోసం. అది ఏపీ ప్రజలను వంచించటమే. ఎందుకంటే హుద్ హుద్ తుఫాను సమయంలో విశాఖపట్నానికి వచ్చిన ప్రధాని మోడీ అప్పుడే కనీసం ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఆ సమీక్షా సమావేశంలో చంద్రబాబు పేరు ప్రస్తావించలేదు.

అంటే దీన్ని బట్టి మోడీ మొదటి నుంచి చంద్రబాబు విషయంలో ఎలా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. తాజాగా తెలంగాణ ఏపీకి లక్ష కోట్ల రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు లెక్కలు చెబుతున్నారు. మరి ఈ ఐదేళ్ళు ఆ ‘లక్ష కోట్ల’ ఊసెత్తలేదే?. అదే టీఆర్ఎస్ తెలంగాణ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఉంటే ఈ లక్ష కోట్లు ఏమీ ఉండవు. సాక్ష్యాత్తూ చంద్రబాబే స్వయంగా కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ రాజీపడి హైదరాబాద్ వదిలేసి వచ్చానని..కొన్ని సంస్థలను కూడా వదిలేసుకున్నామని చెప్పారు. వదిలేసుకోవటానికి అవి ఏమైనా హెరిటేజ్ ఆస్తులా?. ఏపీ ప్రజల హక్కులా?. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు ‘ఆ ముగ్గురి’పైనే భారం వేసినట్లు కన్పిస్తోంది.

Next Story
Share it