పాపం..పువ్వాడ అజయ్!

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిణామాలు ఇఫ్పుడు జిల్లాలో ఆసక్తికరంగా మారాయి. జిల్లాలో ప్రస్తుతం టీఆర్ఎస్ కీలక నేతలుగా ఉన్న వారికి ఒకరంటే ఒకరికి పడదు. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, సీఎం కెసీఆర్ మాత్రం ఖమ్మం లోక్ సభ సీటును నామా నాగేశ్వరరావుకు కేటాయించి ఆయన గెలుపునకూ అందరూ కృషి చేయాలని ఆదేశించారు. ఈ పరిణామంపై ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ను చూసి అందరూ జాలి పడుతున్నారు. అయ్యో..పువ్వాడ అజయ్ అని నిట్టూరుస్తున్నారు. అధికారిక ఎన్నికల ఖర్చుల లెక్కలు ఎలా ఉన్నా తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పువ్వాడ అజయ్ మహాకూటమి తరపున బరిలో నిలిచిన నామా నాగేశ్వరరావుపై భారీ భారీ ఎత్తున ఖర్చు చేసి విజయం సాధించారు. అంతే కాదు..ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే పువ్వాడ అజయ్ ఎవరినైతే భారీ ఎత్తున ఖర్చు పెట్టి ఓడించారో..ఇప్పుడు అదే క్యాండిడేట్ ను మరోసారి భారీ ఎత్తున ఖర్చు పెట్టి గెలిపించాల్సిన అవసరం పడింది. ఈ మేరకు పార్టీ అధినేత నుంచి ఆదేశాలు అందటంతో పువ్వాడ అజయ్ పరిస్థితి చూసి ఆయన అనుచరులు కూడా అవాక్కు అవుతున్నారట.
ఇదెక్కడి విచిత్ర వ్యవస్థ అంటూ నేతలు నిట్టూర్పులు విడుస్తున్నారని ఖమ్మం జిల్లాలో కోడై కూస్తోంది. నిన్న మొన్నటి వరకూ అజయ్, నామా నాగేశ్వరరావులు ప్రత్యర్ధులు. నామాకు తుమ్మలకు పడదు. తుమ్మలకు పొంగులేటికి పడదు. ఇలా జిల్లాలోని కీలకనేతల మధ్య ఎన్నో వైరుధ్యాలు. ఇన్ని వైరుధ్యాలను అధిగమించి అంతా ఒక్కటై నామాను గెలిపిస్తారా?. విభేదాలు పక్కన పెట్టి పనిచేస్తారా?. అంటే అనుమానమే అని చెబుతున్నారు ఎక్కువ మంది నేతలు. దీంతో ఖమ్మం లోక్ సభ సీటు రాష్ట్రంలోనే ‘హాట్ సీటు’గా మారింది. ప్రతి ఒక్కరూ ఖమ్మం ఫలితంపై ఆసక్తిగా చూస్తున్నారు. మరి కెసీఆర్ ఆదేశాలను పాటించి అందరూ కలసి నామా ను గెలిపిస్తారా? లేక నేతల మధ్య విభేదాల కారణంగా కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన రేణుకా చౌదరి అనూహ్య విజయం సాధిస్తారా?. వేచిచూడాల్సిందే.