Telugu Gateway
Politics

ఏపీలో ‘నిర్భంద మహానాయకుడు’ స్కీమ్

ఏపీలో ‘నిర్భంద మహానాయకుడు’ స్కీమ్
X

ఎన్నికల ముందు తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నో కొత్త కొత్త స్కీమ్ లు ప్రకటించారు. అన్నింటి కంటే వెరైటీ పథకం మాత్రం ఇదే. అదే నిర్భంద ‘మహానాయకుడు’ సినిమా వీక్షణం. వచ్చే ఎన్నికల్లో గెలుపునకు ఏ అవకాశాన్ని వదులుకోకూడదని చూస్తున్న చంద్రబాబు..ఇప్పుడు ‘మహానాయకుడు’ సినిమాను కూడా అలాగే వాడేసుకుంటున్నారు. ఇందులో అసలు ఎన్టీఆర్ ను నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ లో కాపాడిన హీరోగా చంద్రబాబును చూపించారు. అందుకే ప్రేక్షకులు ఈ సినిమా చూడకపోయినా సరే టీడీపీ అధినేత మాత్రం బయ్యర్లకు వారానికి రెండు కోట్ల రూపాయల ‘గ్యారంటీ’ కల్పించి సినిమాను ఏప్రిల్ వరకూ నడిచేలా ఒప్పందం చేసుకున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. అందుకే పలు చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు ‘మహానాయకుడు’ ఉచిత షో ఉంది..టిక్కెట్లు కావాల్సిన వారు ఈ నెంబర్లకు సంప్రదించండి అంటూ ఫ్లెక్సీలు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది.

టీడీపీ నేతలు ఇఛ్చే ఉచిత టిక్కెట్లు తీసుకున్న కొంత మంది యువత థియేటర్ దగ్గరకు వెళ్ళి సగం ధర వచ్చినా చాలు అని బాక్సాఫీస్ వద్ద టిక్కెట్లు పట్టుకుని తిరుగుతుంటే ఎగాదిగా చూసి వెనక్కి పంపిస్తున్నారట. తెలుగు ప్రజల్లో ఎన్టీఆర్ కు ఓ ఇమేజ్ ఉంది. సినీ రంగంలోనూ..రాజకీయాల్లోనూ ఓ వెలుగు వెలిగిన ఎన్టీఆర్ ను మరోసారి చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం పణంగా పెడుతున్నారనే టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. సినిమా ఫెయిలైతే ఫెయిలైందనే అందరూ అంటారు. కానీ ఇలా బలవంతంగా టిక్కెట్లు ఇప్పించి...వాటిని మళ్ళీ సగం రేట్లకు అమ్ముకునేలా చేసి..ఎన్టీఆర్ ప్రతిష్టను మసకబార్చేలా చేస్తున్నారని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. మొత్తానికి చంద్రబాబు, బాలకృష్ణలు ఇద్దరూ కలసి ఎన్టీఆర్ ఇమేజ్ పెంచకపోగా..ఆయన ఇమేజ్ కు మరింత నష్టం చేకూరుస్తున్నారనే విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే వస్తున్నాయి.

Next Story
Share it