లండన్ లో నీరవ్ మోడీ

భారతీయ బ్యాంకులకు పదమూడు వేల కోట్ల రూపాయల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోడీ లండన్ వీధుల్లో దర్శనమిచ్చాడు. అలా ఇలా కాదు..ఏకంగా ఏడు లక్షల రూపాయల విలువ చేసే కోటు వేసుకుని సరదాగా వీధుల్లో తిరుగుతూ కన్పించాడు. ఆయన్ను గుర్తించిన ది టెలిగ్రాఫ్ పత్రిక ప్రతినిధి నీరవ్ మోడీని గుర్తించి పలు ప్రశ్నలు సంధించారు. అయినా సరే ఆయన అన్నింటికి ‘ నో కామెంట్..నో కామెంట్’ అంటూ ముందుకు సాగారు. ఎన్ని ప్రశ్నలు వేసినా ఆయన సమాధానం మాత్రం ఒక్కటే. ఎలా రిపోర్టర్ నుంచి తప్పించుకోవాలా అని నీరవ్ మోడీ పలు ప్రయత్నాలు చేశారు.
చివరకు ఓ కారెక్కి చెక్కేశారు. టెలిగ్రాఫ్ రిపోర్టర్ ఏ ప్రశ్నకూ సమాధానం మాత్రం మోడీ చెప్పలేదు. అయినా ఆ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు నీరవ్ మోడీ మీసాలు, గడ్డాలు పెంచాడు. ప్రస్తుతం నీరవ్ మోదీ సెంట్రల్ పాయింట్ టవర్ బ్లాక్‌లో లగ్జరీ ఆపార్ట్ మెంట్‌లో నివాసం ఉంటున్నాడని.. ఆ అపార్ట్‌మెంట్ అద్దె నెలకు రూ.16 లక్షలని ప్రచారం. లండన్‌లోనూ తిరిగి బిజినెస్ ప్రారంభించాడని.. వెస్ట్ ఎండ్‌లో భారీ ఎత్తున వజ్రాల వ్యాపారం ప్రారంభించినట్టు సమాచారం.