Telugu Gateway
Politics

ఎన్నికలకు ముందు ‘ఓట్ల రిగ్గింగ్’

ఎన్నికలకు ముందు ‘ఓట్ల రిగ్గింగ్’
X

ఒకప్పుడు ఎన్నికల్లో గెలుపునకు కొన్ని పార్టీలు ‘రిగ్గింగ్’ను నమ్ముకునేవి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు(ఈవీఎం) వచ్చాక ‘సీన్ మారింది’. ఎంపిక చేసిన చోట్లలో తప్ప..ప్రతి చోటా ఈవీఎంల ద్వారా దొంగ ఓట్లు వేయటం సాధ్యమయ్యే పనికాదు. ఏజెంట్లు అందరూ ఒక్కటైతే తప్ప. ఇప్పుడు ‘టెక్నాలజీ సాయం’తో కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.ఆ రిగ్గింగ్ తో ఓట్లు వేసుకోవటం సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు ఎన్నికలకు ముందే ఓట్ల రిగ్గింగ్ కు పాల్పడుతున్నారు. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించటం కూడా ఓ తరహా రిగ్గింగ్ వంటిదే. ఫ్రస్తుతం ఏపీలో జరుగుతున్న రచ్చ అదే. ఎవరైతే ప్రత్యర్ధి పార్టీకి ఓటు వేస్తారనే అనుమానం ఉందో వాళ్ల ఓట్లను తొలగించటం. ఇదే కొత్త ట్రెండ్ ఇప్పుడు. అసలు ఓటుకు దరఖాస్తు చేసుకోవటానికే బద్దకించే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో రోజుకు ఏకంగా లక్షల సంఖ్యలో ఓట్ల తొలగింపు దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. అంటే ఇది అంతా పక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్నారనే విషయం ఎవరికైనా అర్థం అవుతుంది?. ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీ ఎప్పటి నుంచో తమ అనుకూల ఓట్లు తొలగిస్తున్నారని..బోగస్ ఓట్లు చేర్పిస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ మేరకు ఫిర్యాదులు కూడా చేసింది.

హైదరాబాద్ లో ని ఐటి కంపెనీల్లో ఏపీకి చెందిన అత్యంత కీలకమైన డాటా అందుబాటులో ఉందని..ఈ డేటా ఆధారంగానే ఓట్ల తొలగింపు సాగుతుందనే ఆరోపణలు రావటంతో రచ్చ మొదలైంది. మరి ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే. ఏపీలో ఇప్పుడు టీడీపీ, వైసీపీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. నిజంగా ఇంత భారీ స్థాయిలో తొలగింపు దరఖాస్తులు వస్తే వాటిని పర్పెక్ట్ గా చెక్ చేసి నిర్ణయం తీసుకునేంత వ్యవస్థ, వెసులుబాటు ఎన్నికల కమిషన్ కు ఉండదనే చెప్పుకోవచ్చు. నింపాదిగా జాబితాలు తయారీలోనే పలు తప్పుల తడకలు దర్శనం ఇస్తాయి. అలాంటిది ఎన్నికలకు నెల రోజుల ముందు ఇంత భారీ స్థాయిలో ఓట్ల తొలగింపు దరఖాస్తుల పరిశీలన...నిర్ణయం తీసుకోవటం సాధ్యం అవుతుందా?.

ఓటర్ల జాబితాలు పక్కాగా వస్తాయా?. ఎన్నికల సంఘం ఏ మేరకు ఓటర్లకు భరోసా కల్పించగలదు?. ఇవన్నీ ఇప్పుడు ప్రశ్నలుగా మిగలనున్నాయి. తాజాగా ముగిసిన తెలంగాణ ఎన్నికల్లోనూ లక్షలాది మంది ఓట్లు గల్లంతు అయ్యాయి. ఇది కూడా పెద్ద దుమారం రేపింది. గత రెండు దశాబ్దాలుగా ఎన్నికల్లో...ధనప్రవాహం విపరీతంగా పెరిగిపోయింది. అది ఇప్పుడు ‘కొత్త శిఖరాల’కు చేరుకోబోతోంది. ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి ఖర్చు సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డులాగా ‘కొత్త గరిష్టా’లకు చేరటం ఖాయంగా కన్పిస్తోంది. రాజకీయ పార్టీలు కూడా ‘రిగ్గింగ్’ పోయినా తమ గెలుపునకు కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నాయి.

Next Story
Share it