Telugu Gateway
Politics

నారా లోకేష్ కే తన గెలుపుపై నమ్మకం లేదా?

నారా లోకేష్ కే తన గెలుపుపై నమ్మకం లేదా?
X

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రామసుబ్బారెడ్డిలకు ఓ రూల్. నారా లోకేష్ కు ఓ రూలా?. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో తమ వాళ్ళు ఎమ్మెల్సీ పదవులు వదులుకుని మరీ బరిలో దిగుతున్నరని..టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఇదే సూచించారని టీడీపీ నేతలు ఇంత కాలం చెప్పుకుంటూ వచ్చారు. అంత వరకూ ఓకే. మరి నారా లోకేష్ పరిస్థితి ఏంటి?. టీడీపీ భవిష్యత్ నేతగా ప్రచారంలో ఉన్న నారా లోకేష్ కు తన గెలుపుపై తనకే నమ్మకం లేదా?. అందరిలా ఆయన ఎందుకు ఎమ్మెల్సీ పదవి వదులుకోకుండానే బరిలో నిలుచున్నారు. ‘మంగళగిరి’ నియోజకవర్గంలో పొరపాటున ఏమైనా లెక్క తేడా వస్తే ఉన్న పదవి కూడా పోతుందనే ఆందోళనలోనే లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నారా?. పార్టీ శ్రేణులకు టీడీపీ నాయకత్వం దీని ద్వారా ఎలాంటి సంకేతాలు పంపుతుంది. తెలుగుదేశం పార్టీలోని ఇద్దరు సీనియర్ నేతలు ఎమ్మెల్సీ పదవి వదులకుని బరిలో దిగగా...రాంగ్ రూట్ లో కేబినెట్ లో చేరిన లోకేష్ మాత్రం ఇంకా అదే పదవిని అట్టిపెట్టుకుని ఉండటం టీడీపీ వర్గాల్లో కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. అదే సమయంలో నారా లోకేష్ మంగళగిరి లో విజయం సాధించటం అంత తేలిగ్గా జరిగే విషయం కాదనే అభిప్రాయం ఉంది.

పోటీ నారా లోకేష్, వైసీపీ అభ్యర్ధి ఆళ్ళ రామకృష్ణారెడ్డి మధ్యే హోరాహోరీ ఉంటుందనే విషయం తెలిసిందే. ఏపీలో ఇప్పుడు అందరి ‘ఫోకస్’ మంగళగిరిపైనే ఉంది. దీనికి తోడు ప్రచారంలో నారా లోకేష్ తన సహజశైలిలో చేస్తున్న పొరపాట్లు ఆయన్ను మరింత ఇరకాటంలోకి నెడుతున్నాయి. ఎన్నికల సమయం కావటంతో నారా లోకేష్ ఏ తప్పు మాట్లాడినా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. చంద్రబాబుకు కుప్పంలో ఉన్న పరిస్థితి నారా లోకేష్ కు మంగళగిరిలో ఉండదనే విషయం తెలిసిందే. ఎందుకంటే ఆయన ఎన్నికల బరిలో నిలిచిందే ఇది మొదటిసారి. దీంతో ఆయన గెలుపునకు చెమటోడ్చాల్సి ఉంటుందని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

Next Story
Share it