Telugu Gateway
Politics

మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ

మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ
X

ఎట్టకేలకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఐటి, పంచాయతీరాజ్ ల శాఖ మంత్రి నారా లోకేష్ పోటీ చేసే నియోజకవర్గం ఖరారైంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ బరిలో దిగనున్నారు. చివరకు రాజధాని ప్రాంతంలోనే ఆయన ల్యాండ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా లోకష్ విశాఖపట్నం జిల్లాలోని భీమిలి, విశాఖ నార్త్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. చివరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఈ సీటును లోకేష్ కు ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ సీటు వైసీపీ చేతిలో ఉన్న విషయం తెలిసిందే. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చంద్రబాబు రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున నారా లోకేష్ ఉత్తరాంధ్ర నుంచి బరిలో ఉంటారని ప్రచారం జరిగింది.

కానీ అనూహ్యంగా గుంటూరు జిల్లా నుంచి బరిలోకి దింపారు. రాజధాని ప్రాంతంతోపాటు...టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు సొంత జిల్లా అయిన కృష్ణా జిల్లాను కాదని ఉత్తరాంధ్ర వైపు చూడటంపై కూడా విమర్శలు విన్పించాయి. మంగళగిరి సీటును పోటీకి ఎంచుకోవటం ద్వారా వీటి అన్నింటికి చెక్ పెట్టినట్లు అయింది. సీటు ఖరారు అయిన వెంటనే నారా లోకేష్ నియోజకర్గ నేతలతో సమావేశం అయి తన ఎన్నికల ప్రచార ప్రణాళికను చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేయాలని నిర్ణయించుకోవటంతో ఈ నియోజకవర్గంపై ‘ప్రత్యేక ఫోకస్’ ఏర్పడనుంది.

Next Story
Share it