Telugu Gateway
Politics

బాబోయ్..లోకేష్ భయపెడుతున్నారుగా!

బాబోయ్..లోకేష్ భయపెడుతున్నారుగా!
X

తెలంగాణలో సముద్రంలేదుగా పోర్టు ఎలా పెడతారు స్వామీ

మంగళగిరి వాసులకు ‘కామెడీ’ పంచుతున్న నారా లోకేష్

‘ఏపీలో జగన్ మోహన్ రెడ్డి గెలిస్తే కెసీఆర్ నుంచో మంటే నించుంటాడు. కూర్చోమంటే కూర్చుంటాడు. పోలవరం ప్రాజెక్టు ఆపేస్తారు. అంతే కాదు ముంపు మండలాలు వెనక్కి తీసుకుంటారు. ఇంకో పక్కన మనకు ఏదైతే మచిలీపట్నం పోర్టు ఉందో అది ఇఫ్పుడు వాపస్ తెలంగాణకు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో చూడండి. ’ ఇదీ ఏపీ పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం నాడు మంగళగిరి ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు. మచిలీపట్నం పోర్టును తెలంగాణకు అసలు వాపస్ ఎలా ఇస్తారు?. తెలంగాణలో పోర్టు పెట్టడానికి సముద్రం ఉందా?. మొత్తానికి నారా లోకేష్ తన ఎన్నికల ప్రచారంలో మంగళగిరి వాసులకే కాకుండా రాష్ట్ర ప్రజలకు కూడా పెద్ద ఎత్తున కామెడీ పంచుతున్నారు. ఆయన ప్రచారం కంటే ఇలాంటి వార్తలతోనే హైలెట్ గా నిలుస్తున్నారు. అయితే ఈ వార్తలు ఏవీ కూడా బయటకు రాకుండా ‘భజన పత్రికలు’ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

అయితే వెబ్ మీడియా, సోషల్ మీడియానే వీటిని వెలుగులోకి తెస్తోంది. మంగళగిరి ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తానంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అంతే కాదు..తన ఎన్నికల ప్రచారంలో ఏప్రిల్ 9న ఎన్నికలు అని ప్రకటించి నాలుక కరుచుకున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని వైసీపీ అభ్యర్ధి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా సెటైర్ వేశారు. ఏప్రిల్ 9న అందరూ నారా లోకేష్ కు ఓటు వేసి ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల రోజు మాత్రం తనకు ఓటు వేయాలని కోరారు. ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే ఇంత కామెడీ పండిస్తున్న లోకేష్ ఇక రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి వెళితే ఎంత కామెడీ క్రియేట్ చేస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it