గల్లా జయదేవ్ పై పోటీకి రెడీ

వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్ పై పోటీ చేయటానికి రెడీ గా ఉన్నట్లు మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పిన ఆయన శనివారం నాడు హైదరాబాద్ లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీలో తనకు న్యాయం జరగలేదని..అయితే తనకు పార్టీపై ఎలాంటి ద్వేషం లేదన్నారు. గుంటూరులో టీడీపీ లేకుండా చేయటమే తన లక్ష్యమని వ్యాఖ్యానించారు. పార్టీలో ఉండగా తనపై ఎప్పుడూ విమర్శలు చేయని ఎంపీ గల్లా జయదేవ్ ఇప్పుడు మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. వైపీపీలో చేరిన తర్వాత మోదుగుల మీడియాతో మాట్లాడారు. దిత్వీయ శ్రేణి పౌరుడిగా ఉండలేక టీడీపీని వదిలిపెట్టినట్టు తెలిపారు.
గుంటూరు జిల్లాలో వైసీపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అన్నారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు సైనికుడిలా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధి వైఎస్ జగన్‌తోనే సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారని ఆరోపించారు. హైదరాబాద్‌ను రాష్ట్రానికి దూరం చేసింది చంద్రబాబేనని విమర్శించారు. గుంటూరుకు గల్లా జయదేవ్ గుంటూరుకు అతిథిలాంటి వారని ఎద్దేవా చేశారు. గుంటూరు నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని, బ్యాలెట్ ద్వారా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తనలాంటి నాయకుడిని వదులుకోవడం టీడీపీ ఖర్మ అని పేర్కొన్నారు.