టీడీపీకి మరో షాక్..ఎమ్మెల్యే రాజీనామా

ఊహించిందే జరిగింది. తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు అధికార టీడీపీకి గుడ్ బై చెప్పగా..ఇప్పుడు మరో ఎమ్మెల్యే ఆ జాబితాలో చేరారు. ఆయనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. ఆయన పార్టీని వీడతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఆయన మంగళవారం నాడు టీడీపీకి రాజీనామా చేశారు.అదే సమయంలో ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు పంపారు.
తాజాగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్గర జరిగిన రివ్యూ మీటింగ్ కు కూడా ఆయన డుమ్మా కొట్టారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా రివ్యూ మీటింగ్ లోనే మోదుగుల వైసీపీలోకి వెళ్లటం ఖాయం అయిందని తేల్చిచెప్పారు. టీడీపీకి రాజీనామా చేసిన మోదుగుల త్వరలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయి ఆ పార్టీలో చేరనున్నారు. అయితే ఆయన ఎంపీగా బరిలో దిగుతారా? ఎమ్మెల్యేగానా అన్నది మాత్రం తేలాల్సి ఉంది.కొద్ది రోజుల క్రితం ఆయన పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.