రాఫెల్ పత్రాల చోరీపై కేంద్రం యూటర్న్

రాఫెల్ పత్రాల చోరీ వ్యవహారంపై నరేంద్రమోడీ సర్కారు యూటర్న్ తీసుకుంది. రాఫెల్ పత్రాలు పోలేదని..పత్రికల్లో ప్రచురితం అయింది కేవలం ‘జిరాక్స్’ కాపీలే అంటూ కొత్త పాట అందుకుంది. రక్షణ శాఖ వద్ద రాఫెల్ పత్రాలు సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఓ వైపు ఈ పత్రాలు ప్రచురించిన హిందూ పత్రికపై కేసు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సుప్రీంకోర్టు సాక్షిగా ప్రకటించిన కేంద్ర అటార్నీ జనరల్ కె కె వేణుగోపాల్ ఇప్పుడు అంతా తూచ్ అంటున్నారు. రాఫెల్ పత్రాలు మాయం అయ్యాయని కేంద్రం చెప్పటంతో అత్యంత కీలకమైన రాఫెల్ పత్రాలు కూడా కాపాడలేని వారు దేశాన్ని ఏమి కాపాడుతారని విపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి. అంతే కాకుండా సుప్రీంకోర్టులో కేంద్రం చేసిన వాదన సర్కారు ప్రతిష్టను మసకబార్చేలా ఉండటంతో యూటర్న్ తీసుకోవాల్సి వచ్చినట్లు కన్పిస్తోంది.
సున్నితమైన సమాచారం కలిగిన ఈ పత్రాలు మాయం కావడంపై విచారణ జరిపించాలని, ప్రధాని నరేంద్రమోడీపై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రాఫెల్ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, ప్రశాంత్ భూషణ్‌లు తమ దరఖాస్తులో అనుబంధంగా ఒరిజినల్ పత్రాల ఫోటోకాపీలను వాడారని వేణుగోపాల్ పేర్కొన్నారు. అటార్నీ జనరల్ చోరీ అనే పదాన్ని వాడకుండా ఉండాల్సిందని అధికార వర్గాలు సైతం వ్యాఖ్యానించాయి. మరోవైపు ఈ పత్రాల ఆధారంగా కథనాలను ప్రచురించినందుకు అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేస్తామని ప్రభుత్వం ది హిందూ వార్తాపత్రికను హెచ్చరించింది. మరి అటార్నీ జనరల్ తాజా వివరణపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సిందే.